Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతల ఒత్తిడి...
- తట్టుకోలేక వీఎంసి అధికారి రాజీనామా
న్యూఢిల్లీ : గుజరాత్లోని డోదర మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) నగర అభివృద్ధి అధికారి (టీడీఓ) జితేష్ త్రివేది బుధవారం సాయంత్రం తన విధులకు రాజీనామా చేశారు. నగరంలోని తందాల్జా ప్రాంతంలో ఉన్న మసీదులో అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాలని స్థానిక బీజేపీ కార్పొరేటర్లు... త్రివేదిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. వచ్చే ఏడాది రిటైర్మెంట్ ఉండగా... స్థానిక బీజేపీ నేతలతో విభేదాల వల్లే ఆయన తన విధుల నుంచి తప్పుకున్నారు. కాగా, మేయర్ కేయూర్ రోకాడియా మాట్లాడుతూ... త్రివేది విధులను కొనసాగించాలని కోరినట్టు తెలిపారు. వీఎంసీ జనరల్ బోర్డు సమావేశంలో ఆయన రాజీనామాపై నిర్ణయం తీసుకోనున్నారు. గత నెల 20న... ఇటీవల మసీదు పునరుద్ధరణ పేరుతో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేయాలంటూ వీఎంసీ నోటీసులు ఇచ్చింది. మసీదులో అక్రమ కట్టడాలు జరిగాయంటూ బీజేపీ బిజెపి కార్పొరేటర్ నితిన్ లేవనెత్తారు. మసీదు సమస్యను లేవనెత్తినందుకు తనను చంపేస్తామంటూ బెదిరింపులచ్చినట్టు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నిర్మాణాన్ని కూల్చేయాలంటూ బీజేపీ నేతల నుంచి జితేష్పై ఒత్తిడి పెరిగింది. దీంతో రాజీనామా చేశారు. ఈ నిర్మాణాన్ని కూల్చేయాలని మసీదు ట్రస్టీలకు సమయం ఇచ్చినప్పటికీ... స్థానిక పాలనాయంత్రాంగం.. నిర్మాణాన్ని కూల్చివేయాలని, చర్యలు తీసుకోవాలని త్రివేదిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్టు వీఎంసీ అధికారులు తెలిపారు. అయితే దీనిపై స్పందించిన మేయర్.. ఆయన ఒత్తిడి నేపథ్యంలో రాజీనామా చేయలేదని, ఆరోగ్యం బాగోలేక విధులు నుండి తప్పుకున్నారని పేర్కొంటూ... తిరిగి బాధ్యతల్లో కొనసాగాలని త్రివేదీకి సూచించారు.