Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ కార్యదర్శి వెల్లడి
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన(పీఎంజీకేఏవై) పథకం నవంబర్ తర్వాత అమలుజేసే ఉద్దేశం లేదని మోడీ సర్కార్ ప్రకటించింది. కరోనాతో తలెత్తిన సంక్షోభం దృష్ట్యా కోట్లాది పేద ప్రజలు ఆహార సంక్షోభంలో చిక్కుకున్నారని విమర్శలు వెల్లువెత్తటంతో గత ఏడాది ఏప్రిల్లో 'పీఎంజీకేఏవై' పథకాన్ని కేంద్రం తెరమీదకు తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రతినెలా రేషన్ దుకాణాల ద్వారా ఉచిత బియ్యం లేదా గోధుమలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్ నుంచి మొదలైన ఈ ఉచిత రేషన్ పంపిణీ పథకం ఈ ఏడాది నవంబర్ వరకు కొనసాగనున్నది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని, పుంజుకుందని మోడీ సర్కార్ భావిస్తోంది. దాంతో నవంబర్ 30 తర్వాత ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని పొడిగించే ప్రతిపాదన ఇంతవరకు లేదని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ''ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటం, బహిరంగ మార్కెట్లో ఆహార ధాన్యాల వినియోగం, విక్రయాలు ఈ ఏడాది బాగానే ఉన్నందున పీఎంజీకేఏవై పథకాన్ని పొడిగించే ప్రతిపాదన లేదు'' అని చెప్పారు. దేశంలో కరోనా విజృంభణ, లాక్డౌన్ పరిస్థితుల కారణంగా గత ఏడాది మార్చిలో ప్రధాని మోడీ ఉచిత రేషన్ పథకాన్ని ప్రకటించారు. తొలుత దీనిని ఏప్రిల్ నుంచి జూన్ వరకు అమలుజేయాలని నిర్ణయించినప్పటికీ, ఆ తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది నవంబర్ వరకు కేంద్రం పొడిగించింది. ఈ పథకం ద్వారా దేశంలో దాదాపు 80కోట్లమందికిపైగా లబ్దిదారులకు జాతీయ ఆహారభద్రత చట్టం కింద రేషన్ పంపిణీ జరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.