Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్, డీజిల్ ధరల అరకొర తగ్గింపుపై సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ: లీటర్ పెట్రోల్‌పై రూ. 5, లీటర్ డీజిల్‌పై రూ.10ల ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రజలకు ఎలాంటి ఊరట కలిగించదని, ఇది చాలా నామామాత్రపు తగ్గింపు అని సీపీఐ(ఎం) వ్యాఖ్యానించింది. పార్టీ పొలిట్‌బ్యూరో శుక్రవారం ఈ మేరకు ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్రం ఒక్కటే పెట్రోల్‌పై రూ. 33, లీటర్ డీజిల్‌పై రూ.32 చొప్పున ఎక్సైజు సుంకం రూపంలో పిండుకుంటోంది. ఇప్పుడు తగ్గించింది చాలా స్వల్పం, ప్రజలపైన, ఆర్థిక వ్యవస్థపైన విపరీతంగా మోపిన ఇంధన ధరల భారాన్ని ఇది తగ్గించదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు రావడంతో ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేసినట్టుగా ఉంది. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంధనంపై భారీగా విధించిన ఎక్సైజు సుంకాలను గణనీయంగా తగ్గించుకోవడం, ప్రత్యేక సెస్సులను ఎత్తివేయడం వంటివి చేపట్టడం ద్వారా వీటి ధరలు హేతుబద్ధంగా ఉండేలా చూడొచ్చు అని పొలిట్‌బ్యూరో పేర్కొంది. అక్టోబర్‌లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశం ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసనలను కొనసాగించాలని తన అన్ని శాఖలకు పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది.