Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కాప్ 26' సదస్సులో ప్రధాని మోడీ
- కార్బన్ ఉద్గారాల్ని 2070 నాటికి జీరో స్థాయికి తీసుకొస్తామని వెల్లడి
- భారత్ శక్తి అవసరాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి : పర్యావరణ నిపుణులు
రాబోయే 50 ఏండ్లలో భారత్‌లో కార్బన్ ఉద్గారాల్ని 'జీరో' స్థాయికి తీసుకొస్తామని భారత ప్రధాని మోడీ 'కాప్ 26' సదస్సులో ప్రకటించారు. అయితే ఇది చాలా సుదీర్ఘమైన కాలం. రాజకీయంగా, ఆర్థికంగా ఎన్నో మార్పులు ఉంటాయి. పర్యావరణ మార్పు విషయంలో 2030నాటికి పూర్తిచేస్తామన్న లక్ష్యాలపై భారత్ ఇప్పుడు దృష్టిపెట్టాలి. ఇది ఎంతవరకు వచ్చిందన్న సంగతి తెలియదు. మరోవైపు కార్బన్ ఉద్గారాల్ని తగ్గించటంపై చైనా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. బొగ్గు ఆధారిత పరిశ్రమలు కాకుండా, పునరుత్పాదక వనరులతో నడిచే పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఎలక్ట్రానిక్ వాహనాల్ని పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తీసుకొస్తోంది.
న్యూఢిల్లీ : కాప్-26 సదస్సలో కార్బన్ ఉద్గారాలపై భారత్ చేసిన ప్రకటన ప్రపంచ దేశాలు పెద్దగా స్పందించలేదు. ముఖ్యంగా యూరప్ దేశాలు నిరాశ వ్యక్తం చేసినట్టు తెలిసింది. పర్యావరణవేత్తలు సైతం భారత్ స్వీయ ప్రమాణం సీరియస్‌గా తీసుకోలేదు. దాదాపు 140కోట్ల జనాభా కలిగిన దేశంగా భారత్, రాబోయే 50ఏండ్లలో కార్బన్ ఉద్గారాల్ని 'జీరో' స్థాయికి తీసుకురావటం సాధ్యమయ్యేది కాదని మరికొంత మంది పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. కారణం భారత్ శక్తి అవసరాల్లో 70శాతంపైగా బొగ్గుతోనే తీరుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయ వనరుల్ని పెంపొందించుకోవటంలో, శక్తి వనరుల్ని ఏర్పాటుచేసుకోవటంలో భారత్ చేస్తున్న కృషి చాలా స్పల్పం. అయితే భూతాపంపై శాస్త్రవేత్తలు చెబుతున్నదాన్ని బట్టి, ప్రపంచం 2050నాటికి కార్బన్ ఉద్గారాల్ని 'జీరో లెవల్'కు తీసుకెళ్లాలి. లేదంటే పర్యావరణ సమస్యలు తప్పవు. బొగ్గు వాడకాన్ని సాధ్యమైనంత తొందరగా తగ్గించుకోవాలి. అయితే భారత్‌లో బొగ్గు ఉత్పత్తి, వాడకం ముందు ముందు పెరుగుతుందేగానీ, తగ్గే సూచనలు కనపడటం లేదు.
పెరుగుతున్న అవసరాలు
భారత్‌లో 2021లోనూ విద్యుత్ సౌకర్యంలేని గ్రామాలున్నాయి. పట్టణాల్లోనే గంటల తరబడి కరెంట్ పోవటం సర్వసాధారణమైన విషయం. ఇక గ్రామాల్లోని సంగతి చెప్పక్కర్లేదు. విద్యుత్‌రంగంలో మౌలిక వసతుల అభివృద్ధిలో భారత్ చాలా వెనుకబడి ఉంది. రాబోయే రెండు దశాబ్దాల్లో 30కోట్ల కొత్త వాహనాలు రోడ్లమీదకు రాబోతున్నాయి. 2030నాటికి 24కోట్లకుపైగా ఎయిర్ కండీషనర్లు దేశంలో పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతుందేగానీ, తగ్గదు. ప్రస్తుతం దేశంలో శక్తి అవసరాల్ని తీర్చటంలో బొగ్గు వాటా 70శాతంగా ఉంది. ఓవైపు విద్యుత్ అవసరం ఈస్థాయిలో ఉండగా, బొగ్గు వాడకాన్ని 'జీరో' స్థాయికి తీసుకెళ్తామనే ప్రధాని ప్రకటన నమ్మశక్యంగా లేదని పర్యావరణ నిపుణులు విమర్శిస్తున్నారు. ఒకవేళ బొగ్గు వాడాకాన్ని తగ్గించాలని ప్రణాళికలు వేసినా, అది దేశ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని శక్తి వనరులపై పరిశోధకుడు సిద్ధార్థ్ సింగ్ చెబుతున్నారు.
పాశ్యాత్య దేశాలదే బాధ్యత : టిమ్ బక్లే, దక్షిణాసియా డైరెక్టర్ ఐఈఈఎఫ్ఏ
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ సంక్షోభానికి కారకులు పాశ్చాత్య దేశాలు. బొగ్గు వాడకాన్ని తగ్గించుకోవ టంలో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా, సాంకేతికంగా సాయం చేస్తామని ధనిక దేశాలు చేసిన వాగ్ధానాలేవీ నెరవేరలేదు. కార్బన్ ఉద్గారాల్ని 2070నాటికి 'జీరో' స్థాయికి తెస్తామని భారత్ చెబుతోంది. అయితే ఇందుకోసం క్లీన్ ఎనర్జీపై పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి వుంటుంది. ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌ల అమ్మకాలు ఒక్కశాతం కూడా లేవు. దీనిని రాబోయే 8ఏండ్లలో 40శాతానికి తీసుకెళ్లాలి. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానంపై పెద్దఎత్తున ఖర్చు చేయాల్సివుంటుంది.