Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానా బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు
- ఆగ్రహించిన అన్నదాతల నిరసనలు
- పోలీసుల లాఠీచార్జ్
- ఉద్యమం ఐదేండ్లయినా కొనసాగుతుంది : రాకేష్ టికాయిత్
హిస్సార్ : హర్యానాలోని హిస్సార్ జిల్లాలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామ్ చందర్ జంగ్రా రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీపావళి సందర్భంగా రోహతక్‌లో ఆశ్రమంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులనుద్దేశించి తీవ్రవ్యాఖ్యలు చేశారు. 'ఆ రైతులు పనిలేని తాగుబోతులు. సోమరిపోతులు, ఆ నిరసనను చేస్తున్నది రైతులు కాదు' అంటూ ఇష్టానుసారంగా మాట్లాడారు.
పోలీసుల లాఠీచార్జ్
హర్యానాలోని హిసార్ జిల్లా నార్నాండ్ పోలీస్ స్టేషన్ వెలుపల ఆందోళన కొనసాగుతున్నది. హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు రైతులను బేషరతుగా విడుదల చేయాలని వందలాది మంది రైతులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ నేతలు కృష్ణ ప్రసాద్, ఇంద్రజిత్ సింగ్, సుమిత్ సింగ్, బీకేయూ నేత గుర్నామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేస్తున్న రైతులపై తొలుత పోలీసులు లాఠీచార్జికి పాల్పడగా.. పలువురు రైతులు గాయపడ్డారు. వారిని జిందాల్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉన్న రైతుల్లో ఒకరైన కుల్దీప్ సింగ్ రాణా పరిస్థితి విషమంగా ఉంది. ఎంపీ రామ్ చందర్ హర్యానాలోని రోV్ాతక్ జిల్లాలోని మెహమ్-జులానా రోడ్లో మెహమ్‌లోని గౌశాలలో దీపావళి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు నల్ల జెండాలతో రైతులు నిరసన తెలిపారు. అక్కడ పోలీసులు, రైతులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఏడుగురు రైతులు గాయపడ్డారు. బీజేపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేయడం మానుకోవాలనీ, లేదంటే రైతుల ఆగ్రహాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని ఎస్కేఎం హెచ్చరించింది. నిర్బంధంలో ఉన్న రైతులందరినీ వెంటనే విడుదల చేయాలనీ, గాయపడిన రైతులందరికీ అత్యవసరంగా వైద్య సహాయం అందించాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది. మరోవైపు హర్యానాలోని రోV్ాతక్ జిల్లాలో కిలోరు గ్రామంలో ప్రధానమంత్రి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు ఆలయానికి చేరుకున్న పలువురు బీజేపీ నాయకులను నిరసన తెలిపిన రైతులు ఘెరావ్ చేశారు. జిల్లా యంత్రాంగం భారీ సంఖ్యలో పోలీసులను మోహరించడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.
'దీపాల వెలుగుల' కార్యక్రమం...
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతుధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న చారిత్రాత్మక పోరాటంలో అమరవీరులైన రైతులకు ప్రజలు నివాళులర్పించారు. వారి గుర్తు చేసుకుంటూ దీపాలు వెలిగించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా దీపాల వెలుగుల కార్యక్రమం నిర్వహించారు. దీపావళిని అన్ని మతాలకు చెందిన ప్రజలు రైతుల ఉద్యమంలో అమరవీరులకు నివాళులర్పిస్తూ అనేక ప్రదేశాలలో నిర్వహించారు. రైతు ఉద్యమంలో ఇప్పటివరకు 653 మందికి పైగా రైతులు అమరవీరులు అయ్యారు. దీపావళి సందర్భంగా వారి త్యాగాలు గుర్తు చేసుకున్నారు. షాజహాన్‌పూర్ సరిహద్దు వద్ద కార్యక్రమంలో ఏఐకేఎస్ నేతలు అమ్రారామ్, పి.కృష్ణ ప్రసాద్, చంగన్‌లాల్, సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఎఆర్ సింధూ, ఏఐఏడబ్ల్యూయూ నేత పవన్ దుగ్గల్, టిక్రీ సరిహద్దు వద్ద జరిగిన కార్యక్రమంలో ఏఐకేఎస్ నేత ఇంద్రజిత్ సింగ్, ఐద్వా నేత జగ్మతి సంఘ్వాన్ తదితరులు పాల్గొన్నారు. ఘాజీపూర్ సరిహద్దు జరిగిన కార్యక్రమంలో బికెయు నేత రాకేష్ తికాయిత్ దీపాలు వెలిగించి, అమరవీరులను గుర్తు చేసుకున్నారు.
ఉద్యమం ఐదేండ్లయినా కొనసాగుతుంది : రాకేష్ టికాయిత్
రైతు ఉద్యమం ఐదేండ్లయినా కొనసాగుతుందని రైతు నేత రాకేష్ టికాయిత్ స్పష్టం చేశారు. తమతో ప్రభుత్వం చివరిసారిగా జనవరి 22న చర్చించిందనీ, ఆ తరువాత ప్రభుత్వం చర్చలు జరపలేదని తెలిపారు. నవంబర్ 26 నాటికి తమ పోరాటం ఏడాది పూర్తి అవుతుందనీ, రైతులు తమ ట్రాక్టర్లతో సిద్ధంగా ఉన్నారని మీడియాకు తెలిపారు. రైతు ఉద్యమం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందని ప్రశ్నించగా, అందుకు స్పందించిన టికాయిత్ ప్రభుత్వం ఇలాగే చట్టాలను రద్దుచేయకుండా ఐదేండ్లు మొండిగా వ్యవహరిస్తే.. తమ ఉద్యమం కూడా ఐదేండ్లపాటు కొనసాగుతుందని అన్నారు. ధరల పెరుగుదల, పేదరికంపై ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన, దీపావళి రోజున చాలా మంది ఇండ్లలో దీపం ఎందుకు వెలిగించలేకపోతున్నారో ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు.