Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 లక్షల దీపాలంటూ మీడియా ఆర్బాటం
- 5 కోట్ల మంది నరేగా కార్మికులకు అందని వేతనాలు
దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో తొమ్మిది లక్షల దీపాలను వెలిగించి... గిన్నీస్ రికార్డును సృష్టించడంపై దృష్టి పెట్టిన మీడియా... అదే యూపీతో పాటు దేశ వ్యాప్తంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న సుమారు 5 కోట్ల మంది కార్మికుల జీవితాల్లో చీకట్లు కమ్ముకున్న విషయాన్ని విస్మరించింది.
న్యూఢిల్లీ : నరేగా సమాచార వ్యవస్థ (ఎంఐసీ).. ప్రభుత్వ నివేదిక ప్రకారం.. నవంబర్ 3, 2021 గ్రామీణ ఉపాధి కార్మికులకు 8 కోట్ల రూపాయల బకాయిలను కేంద్రం చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపులు పెండింగ్లో ఉన్నందున.. దేశ వ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది కార్మికులు దీపావళి పండుగను జరుపుకోవడం లేదని పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లారుమెంట్ గ్యారెంటీ (పీఏఈజీ) తన నివేదికలో తెలిపింది. ఈ పథకం కింద నిధులన్నీ దాదాపుగా అంటగడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో ఈ నివేదిక ఎత్తి చూపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ. 4,920 కోట్లను చెల్లించాల్సి ఉంది. జూన్ నుంచి వేతనాలను కేంద్రం చెల్లించాల్సి ఉంది. పండుగ అనగానే ప్రజలు కేవలం వేతనాల కోసమే కాకుండా బోనస్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తారని, కానీ చేసిన పనికి వేతనాలు తీసుకోలేని పరిస్థితుల్లో నరేగా కార్మికులు ఉన్నారు. అయితే వీటిని సమీప భవిష్యత్తులో చెల్లిస్తారన్న ఆశ కూడా అస్పష్టంగా ఉందని నివేదికలో పేర్కొంది. పనులు కొనసాగేందుకు రూ. 8,900 కోట్లు అందుబాటులో ఉన్నట్టు గ్రామీణాభివృద్ధి నోడల్ మంత్రిత్వ శాఖ (ఎంఆర్డీ) పేర్కొనడాన్ని పీఎఈజీ ఎత్తి ప్రస్తావించింది. 'ఎంఆర్డీ పేర్కొన్నదీ వాస్తవమైతే.. నవంబర్ 3, 2021 నాటికి చెల్లించాల్సిన రూ.8 కోట్ల లావాదేవీలపై ఏం వివరణనిస్తుంది?' అని ప్రశ్నించింది.
అదేవిధంగా నవంబర్ 3 నాటికి 24.15 లక్షల రూపాయల లావాదేవీలు.. దాదాపు రూ.300 కోట్ల నరేగా వేతనాలు సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. అయితే కార్మికులు అందుబాటులో లేరన్న కారణాన్ని చూపించి ..వారికి వేతనాలు చెల్లించలేకపోవడం చాలా ఘోరమని తెలిపింది.ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులందరినీ, ప్రత్యేకించి సమాజంలోని అట్టడుగున జీవిస్తున్న వారిని ఒకేలా చూడటం లేదని పీఎఈజీ విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం తన సొంత ఉద్యోగులకు 28 శాతం డిఎ, 3 శాతం బోనస్ ఇచ్చింది. కానీ నరేగా కార్మికులకు మాత్రం మొండి చేయి చూపిందని పేర్కొంది.
పండుగ సమయాల్లో వారి మానాన వారిని వదిలేసిందని నివేదికలో పేర్కొంది. రూ.73 వేల కోట్లను కేటాయించినప్పటి నుంచి, గతేడాది సవరించిన అంచనాను 34 శాతం తగ్గించడం ద్వారా, సంవత్సరం మొత్తంలో దాదాపు సగం డబ్బును వినియోగించినట్లు స్పష్టం చేసింది. ఈ వెలుగుల పండుగ రోజున లేజర్ షోలు, దీపాలకు కోట్లు ఖర్చు పెట్టిన కేంద్రం, తాము చేసిన పనికి వేతనాలు అందుకోలేని నరేగా కార్మికుల పట్ల వివక్షతతో వ్యవహరించింది. సుమారు ఎనిమిది కోట్ల మంది జీవితాల్లో చీకట్లను నింపింది.