Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరూ చేయండి.. ప్రధానిని కోరిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ : ప్రజలకు ఉచిత రేషన్ పంపిణీని వచ్చే ఏడాది మే వరకు పొడిగిస్తూ దేశరాజధాని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో ఢిల్లీలోని పేద ప్రజలు మరో ఆరు నెలల పాటు ఉచిత రేషన్‌ను పొందనున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. కేంద్రం కూడా ఇదే విధంగా ఉచిత రేషన్ పంపిణీని పొడిగించాలని ప్రధాని మోడీని కేజ్రీవాల్ కోరారు. '' ద్రవ్యోల్బణం శిఖర స్థాయిలో ఉన్నది. సాధారణ పౌరుడు తిండికి తిప్పలు పడుతున్నాడు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ప్రధాన మంత్రి గారూ, ఉచిత రేషన్ పంపిణీని దయచేసి మరో ఆరు నెలలు పొడగించండి. ఢిల్లీ ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరునెలలు పొడిగిస్తున్నది'' అంటూ కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు. నవంబర్ 30 తర్వాత ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాన్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద ఉచిత రేషన్ పంపిణీని పొడిగించే ప్రతిపాదన కేంద్రానికి లేదని ఫుడ్ సెక్రెటరీ సుధాన్షు పాండే రెండు రోజుల క్రితం తెలిపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మరో ఆరు నెలల పాటు ఉచిత రేషన్ పంపిణీని పొడిగిస్తూ కేజ్రీవాల్ సర్కారు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నేషనల్ ఫుడ్ సెక్యురిటీ యాక్ట్ (ఎన్ఎఫ్ఎస్ఏ), 2013, పీఎంజీకేఏవై కింద లబ్దిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఉచిత రేషన్‌ను పంపిణీ చేస్తున్నది. ఢిల్లీలో ప్రస్తుతం 17.77 లక్షల రేషన్ కార్డులున్నాయి. దాదాపు 72.78 లక్షల మంది లబ్దిదారులున్నారు.