Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ సంరక్షణ చట్టం ప్రతిపాదిత సవరణలపై నిపుణుల ఆందోళన
- ఉద్గారాల తగ్గింపు లక్ష్యం మరింత ఆలస్యమయ్యే అవకాశం
న్యూఢిల్లీ: ఇటీవల ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టం (ఎఫ్సీఏ)కు ప్రతిపాదించిన సవరణలు అటవీ హక్కుల చట్టం (ఎఫ్ఆర్ఏ)కు విరుద్ధంగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, వాతావరణ మార్పుల నేపథ్యంలో భారత్ పెట్టుకున్న లక్ష్యాలను సాధించడంలో ఆలస్యమయ్యే అవకాశముందని పర్యావరణ న్యాయవాది గౌరీ ఆనంద్ పేర్కొన్నారు. గత నెల, పర్యావరణ మంత్రిత్వ శాఖ.. అటవీ పరిరక్షణ చట్టం-1980 (ఎఫ్సీఏ)కు ప్రతిపాదిత సవరణలు చేసిన ముసాయిదా, సంప్రదింపుల పత్రాలను విడుదల చేసింది. ''గత 40 ఏండ్ల కాలంలో దేశంలో పర్యావరణ, సామాజిక మరియు పర్యావరణ పాలనలలో గణనీయమైన మార్పు వచ్చింది. నియమాలు, మార్గదర్శకాల రూపంలో తగిన చట్టాలను ప్రవేశపెట్టడం ద్వారా చట్టంలోని నిబంధనలను మన దేశ పర్యావరణ, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఉంచడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులకు సమర్థవంతంగా సరిపోయేలా, ప్రత్యేకించి పరిరక్షణ-అభివృద్ధిని వేగవంతం చేసే ఏకీకరణ కోసం, చట్టాన్ని మరింత సవరించాల్సిన అవసరం ఏర్పడింది'' సంబంధిత మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాఆలకు రాసిన లేఖలో పేర్కొంది. ఇక ఈ ముసాయిదాపై స్పందనలు, సూచనలు పంచుకోవడానికి 15 రోజుల సమయం ఇచ్చింది.
అయితే, ప్రతిపాదిత సవరణ ముసాయిదాలో ముఖ్యంగా చర్చకు లేవదీసిన అంశాలు రెండు ఉన్నాయి. అందులో మొదటిది వాతావరణ మార్పులు, రెండోది పౌర సంఘాలు, ఆయా ప్రాంతాల వారీ హక్కులు. ఈ ఏడాది మార్చిలో ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన వివరాల ప్రకారం దేశంలో వ్యాపారాన్ని సౌలభ్యాన్ని మెరుగుపర్చడం పేరిట.. అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం రిగిజన హక్కులను ప్రభావితం చేసే విధంగా కొత్త నిబంధనలు ప్రతిపాదించింది. అటవీ భూమిని అటవీయేతర వినియోగానికి మళ్లించే ముందు గ్రామసభల నుండి ముందస్తు సమాచార సమ్మతి పొందడం అవసరం. ఈ విషయంలో ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో స్థానికులు అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. అటవీ క్లియరెన్స్, డీలింక్ ప్రతిపాదనలు వివాదాస్పదంగా ఉన్నాయి. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైతం సవరించిన మార్గదర్శకాలను తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పటి నుంచి చాలా వరకు నిలిచిపోయాయి. ప్రభుత్వం గతంలో పరిహార అటవీ నిర్మూలన చట్టం-2016ని ఉపయోగించింది.. గిరిజనుల భూమిని మళ్లించడానికి సమ్మతి ఆవశ్యకతలను దాటవేయడానికి పరిహార అటవీ పెంపకం ముసుగులో వ్యవసాయ భూముల విషయంలో అభ్యంతరాలను క్లియర్ చేయడానికి నిబంధనలను పదేపదే సవరించింది. ఫలితంగా జీవవైవిధ్యంలో మార్పులు, ప్రమాదపుటంచున ఉన్న సమూహాల స్థానభ్రంశానికి దారీ తీసింది. తాజా సవరణల్లో జాతీయ భద్రతా పేరిట ముందస్తు అనుమతి పొందల్సిన అవసరంలేకుండా ప్రభుత్వ ఏజెన్సీలను మినహాయిస్తుంది. అయితే, పాత చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది కానీ 'అడవులు' నిర్వచనాన్ని మార్చడంపై ఎక్కువగా దృష్టి సారించడం ద్వారా, ప్రతిపాదిత సవరణ చాలా వరకు రద్దు చేసే ప్రయత్నంలో అనుమానాస్పదంగా ఉంది. అటవీ భూములను రికార్డుల్లో మార్చి.. అటవీయేతర వినియోగానికి ప్రయివేటు వ్యక్తులకు అందించే అవకాశము లేకపోలేదని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ హక్కులు, గిరిజన హక్కులు దగ్గరి సంబంధాలు కలిగివుంటాయని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా తాజా ప్రతిపాదిత సవరణలు గిరిజన, ఆదివాసీ హక్కులను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముంది. ఆయా ప్రాంత నివాసితులు నష్టపోవడమే కాకుండా పర్యావరణంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘకాలంపాటు ఈ పర్యావసనాలు ఉంటాయని పేర్కొంటున్నారు. భారత్ నిర్ధేశించుకున్న గ్రీన్ వాయు ఉద్గారాల తగ్గింపు లక్ష్యంపైనా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.