Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం
న్యూఢిల్లీ : గతకొన్ని రోజులుగా త్రిపురలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. మత ఘర్షణలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నవారిపై త్రిపుర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. రాష్ట్రంలో మత ఘర్షణలుపై సామాజిక మాధ్యమాల్లో(ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్) నిరసనగళం వినిపించిన 102మందిపై త్రిపుర పోలీసులు 'ఉపా'(చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం)ను ప్రయోగించారు. వివిధ సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదుచేసి, విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు. ఈ వ్యవహారంపై త్రిపురలో వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిరసనగళం వినిపించిన వారందర్నీ దేశద్రోహులుగా బీజేపీ చూపే ప్రయత్నం చేస్తోందని వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్రిపుర పోలీస్ వర్గాల కథనం ప్రకారం, మత ఘర్షణలపై ట్విట్టర్లో సందేశాలు పోస్ట్ చేసిన 68 ఖాతాదార్లపై, 32 ఫేస్బుక్ అకౌంట్లపై, రెండు యూట్యూబ్ అకౌంట్లపై 'ఉపా' కేసులు నమోదయ్యాయి. తొలుత ఈ కేసులన్నీ వెస్ట్ అగర్తలా పోలీస్ స్టేషన్లో నమోదుకాగా, వీటిని త్రిపుర స్టేట్ క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు. దీనికంటే ముందు త్రిపుర పోలీసులు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న నలుగురు న్యాయవాదులపైనా 'ఉపా' కేసులు పెట్టారు. మత ఘర్షణల్లో ముస్లింలపై, మసీద్‌లపై జరిగిన దాడికి సంబంధించి వాస్తవాల్ని తెలుసుకొనేందుకు 'స్వతంత్ర నిజనిర్ధారణ'లో భాగంగా ఆ నలుగురు న్యాయవాదులు త్రిపురలో పర్యటించారు. మత ఘర్షణల వెనుక హిందూ అతివాద గ్రూపులు ఉన్నాయని, ఇది తమ క్షేత్రస్థాయి విచారణలో గుర్తించామని ఆ న్యాయవాదులు సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. దాంతో న్యాయవాదుల గొంతును అణచివేయడానికి త్రిపుర ప్రభుత్వం పోలీసుల్ని రంగంలోకి దింపింది. 'ఉపా' కేసులు నమోదు చేసి, నోటీసులు పంపింది. తాజాగా మరో 102మందిపైనా 'ఉపా' కింద కేసులు నమోదుచేసిన అగర్తలా పోలీసులు 'ట్విట్టర్'కు లేఖ రాశారు. 68మంది ఖాతాల్ని నిలిపివేయాలని, వారి వ్యక్తిగత సమాచారాన్ని అందజేయాలని లేఖలో కోరారు. మత ఉద్రిక్తతలను పెంచేవిధంగా ట్విట్టర్లో వారి పోస్టులు ఉన్నాయని ఉపా చట్టంలోని సెక్షన్ 13కింద ఆరోపణలు నమోదయ్యాయి. అయితే కేసులు నమోదైన ఈ 68మందిలో చాలా మంది జర్నలిస్టులు ఉన్నారని సమాచారం. వీరిలో చాలామంది జర్నలిస్టులుగా అక్కడ జరిగిన మత ఘర్షణల సమాచారాన్ని బయటపెట్టారు.
చట్ట విరుద్ధం, అనైతికం : జితేంద్ర చౌదరీ, సీపీఐ(ఎం) ఎంపీ
పోలీసుల చర్య చట్ట విరుద్ధం, అనైతికం. భారత రాజ్యాంగం ఇచ్చిన పౌరహక్కుల్ని ఉల్లఘించటమే. రాష్ట్రంలో మత ఘర్షణల వెనుక సంఫ్‌ు పరివార్ కార్యకర్తలున్నారనేది వాస్తవం. రాష్ట్రంలో మత ఘర్షణలు జరిగాయన్నది వాస్తవం. కాబట్టే దీనిపై అనేకమంది స్పందించటం సహజం. నిరసన వ్యక్తం చేసినవారిపై కేసులు నమోదు చేయటం హాస్యాస్పదం. త్రిపురలో శాంతిభద్రతలు నెలకొల్పటం లో అధికార బీజేపీ విఫలమైంది. దీనిని కప్పిపుచ్చుకో వడానికి పోలీసు చర్యలకు దిగుతోంది. ఢిల్లీకి చెందిన నలుగురు న్యాయవాదులపైనా పోలీసులు ఉపా కేసులు చేయటం బ్రిటీష్ పాలనను గుర్తుచేస్తోంది.