Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్మూకాశ్మీర్‌లో భారీగా భద్రతా బలగాల మోహరింపు
- శ్రీనగర్‌లో సైనిక నిలయాలుగా మారుతున్న కళ్యాణ మండపాలు
- అమిత్‌షా పర్యటన.. ఇటీవల ఘటనల నేపథ్యంలోనే... : సీనియర్ అధికారులు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులు యుద్ధం జరగబోతున్నదా.. అనే విధంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసిన సైనకబలగాల మోహరింపుతో ప్రజల్లో ఆందోళన, అలజడి వ్యక్తమవుతోంది. జమ్మూకాశ్మీర్‌లో ఇటీవలి మిలిటెంట్ల హింసాకాండ కారణంగా ఆయా ప్రాంతాలంతటా సైనికుల మోహరింపును వేగవంతం చేయడంతో శ్రీనగర్‌లోని కళ్యాణ మండపాలన్ని భద్రతా బలగాల బ్యారక్‌లుగా మారుతున్నాయి. ''గత నెలలో కేంద్ర హౌంమంత్రి అమిత్ షా.. శ్రీనగర్ పర్యటన అనంతరం.. ఆయన అధ్యక్షతన జరిగిన భద్రతా సమీక్షా సమావేశం తర్వాత కాశ్మీర్లో అదనపు భద్రతా బలగాలను మోహరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అదనంగా 50 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు, 25 కంపెనీల బీఎస్ఎఫ్ బలగాలు మోహరిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర హౌంశాఖ ఆదేశాల మేరకే బలగాల మోహరింపును పెంచామని వెల్లడించారు. ఒక్క శ్రీనగర్‌లోనే 30 కంపెనీలకు చెందిన సీఆర్పీఎప్, బీఎస్ఎఫ్ బలగాలను మోహరిస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నారు. ''భద్రతా బలగాల బహిరంగా ఉనికి సంచలనాత్మక దాడులకు ప్రయత్నించే ఉగ్రవాద చర్యలను నిరోధిస్తుందని'' ఓ అధికారి తెలిపారు. కాగా, ఇటీవల వసల కార్మికులను కాల్చి చంపడం, వారిపై దాడులు, మైనారిటీ వర్గాలపైనా దాడులు, ఓ సిక్కు పాఠశాల మహిళా ప్రిన్సిపల్, సిబ్బంది, ఓ కాశ్మీరీ పండిట్‌ను కల్చిచంపిన నేపథ్యంలో మళ్లీ జమ్మూ అంతటా ఉగ్రకలాపాలు పెరుగుతున్న పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారుల సమాచారం.
అయితే, జమ్మూకాశ్మీర్ అంతటా భారీగా భద్రతా బలగాల భారీ మోహరింపు ఏదైనా యుద్ధం జరగబోతున్నదా? అనే విధంగా పరిస్థితి కనిపిస్తున్నది. దీనిపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం ముట్టడిలో జీవిస్తున్నట్టుగా భావిస్తున్నారు. గత కొన్ని నెలల్లోనే రోడ్లపై డజన్ల కొద్దీ కొత్త బంకర్లు, చెక్పాయింట్లు పుట్టుకొచ్చినందున శ్రీనగర్ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ''మేము జైలులో జీవిస్తున్నట్టుగా ఉంది. నా ఇంటికి 3 కిలో మీటర్ల దూరంలోని లాక్చౌక్లోని ఆఫీసుకు వెళ్లడానికి ఈ మార్గంలో నిత్యం మూడు చెక్‌పోస్టులను దాటాలి'' అని మొబైల్ రిపేర్ షాప్‌లో పనిచేసే చన్‌పోరా ప్రాంతంలో నివాసి ఆదిల్ అహ్మద్ అన్నారు. బలగాల మోహరిపు మంచిదే. ఈ నిర్ణయానికి తామ వ్యతిరేకం కాదు కానీ, అధికారుల నుంచి పలు రకాల ఒత్తిడీలు, సమస్యలు, గంటల తరబడి వారి వాహనాలు రోడ్లపై నిలిచిపోవడంతో అసౌకర్యానికి గురవుతున్నామని షత్రాషాహి నివాసి షబ్బీర్ అహ్మద్ అన్నారు. ''బయటకు రావాలంటేనే భయంగా ఉంది. భద్రత పేరుతో ఇది స్థానికులకు వేధించే మరో అంశంగా మారుతుంది'' అని మరో స్థానికుడు పేర్కొన్నారు. ఇదిలావుండగా, భద్రతాబలగాల కోసం శాశ్వత నిర్మాణ చర్యలను ప్రభుత్వం భారీగా చేపడుతోంది.