Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర ఆస్పత్రిలో ప్రమాదం
- 10మంది కోవిడ్ రోగులు మృతి
అహ్మద్‌నగర్ : మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో సివిల్ ఆస్పత్రిలో శనివారం దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రిలోని ఐసీయూలో మంటలు చెలరేగడంతో పదిమంది రోగులు మరణించారు. మరో రోగి తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలోని కోవిడ్ వార్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో 17మంది రోగులు వున్నారు. మిగిలిన రోగులను వేరే ఆస్పత్రిలోని కోవిడ్ వార్డుకు తరలించినట్టు జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోస్లే విలేకర్లకు తెలిపారు. ఈ ఆస్పత్రికి ఫైర్ ఆడిట్‌ను కూడా నిర్వహించినట్టు చెప్పారు. ఇంతమంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియచేశారు. గాయపడిన వారు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ విషాద ఘటనపై దర్యాప్తుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాకరే ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. కాగా, మంటలు చెలరేగడానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు. అయితే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి వుంటాయని అగ్ని మాపక అధికారులు జరిపిన ప్రాధమిక విచారణలో తేలిందని భోస్లే తెలిపారు. ఆస్పత్రిలోని కింది అంతస్తుల నుండి దట్టంగా పొగ వస్తున్నట్టు వీడియో దృశ్యాలు కనిపిస్తున్నాయి. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత కొంతమంది నెమ్మదిగా వార్డు లోపలకు వెళ్ళడం కూడా కనిపిస్తోంది. పైన సీలింగ్ విరిగిపోయి, గోడలపై మరకలు కనిపిస్తు న్నాయి. కాగా మరోవైపు మంటల్లో చిక్కుకున్న రోగులను కాపాడేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఐసీయూ కొత్తగా కట్టిం దేనని, అందులో మంటలు చెలరేగడమంటే చాలా తీవ్రమైన విషయమని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. అన్ని ఆస్పత్రులు ఫైర్ ఆడిట్‌ను నిర్వహించాలని కోరారని, ఈ ఆస్పత్రికి సంబంధించిన నివేదికను కూడా పరి శీలిస్తామని చెప్పారు. కూలంకషంగా దర్యాప్తు జరుగుతుందని ఆయన చెప్పా రు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.