Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ హక్కుల కార్యకర్త బేలా భాటియా
రారుపూర్: సుక్మా జిల్లాలో 8 మంది ఆదివాసీ నిరసనకారులను ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్టు చేశారనీ, వారిపై తప్పుడు అభియోగాలు మోపారని మానవ హక్కుల కార్యకర్త బేలా భాటియా అన్నారు. సిల్గర్ గ్రామంలో పోలీసు శిబిరానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన నుండి తిరిగి వస్తుండగా వారిని అరెస్టు చేసినట్టు భాటియా మీడియాకు తెలిపారు. సిల్గర్ గ్రామంలోని భద్రతా శిబిరాలను వ్యతిరేకిస్తున్న ప్రజలపై అధికారులు కాల్పులు జరిపిన మే నుండి ఆదివాసీలు పోలీసు హింసకు భయపడుతున్నారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మావోయిస్టుల తుపాకీ కాల్పులకు ప్రతిస్పందనగా తాము కాల్పులు జరిపామని పోలీసులు పేర్కొన్నారు. అయితే నిరసనకారులు.. తమ మధ్య సాయుధులైనవారు ఎవరూ లేరని ఖండించారు.నిరసన నుంచి తిరిగి వస్తుండగా ఆదివాసీ నిరసనకారులను మోర్పల్లి గ్రామంలో 150 మంది పోలీసు అధికారులు అడ్డగించి చింతల్నార్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారనీ, 55 మందిలో 8 మందిపై ఆయుధాలు, పేలుడు పదర్థాల చట్టం కింద కేసులు నమోదుచేశారు. మిగిలినవారిని విడుదల చేయగా, వారిలో ఓ మహిళా ఇప్పటికీ కనిపించకుండా పోయిందని భాటియా వెల్లడించారు. అయితే, అరెస్టయిన 8 మందిని శుక్రవారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదనీ, ఇది చట్టాన్ని ఉల్లంఘించడమేనని తెలిపారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమాయకులైన ఆదివాసీలపై తప్పుడు కేసుల బనాయించి మావోయిస్టులుగా చూపించే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు, అరెస్టయిన వారి నుండి ఆదివాసీలను రక్షించామంటూ చెప్పుకొచ్చారు. ''అరెస్టయిన 8 మంది మావోయిస్టులు ఈ గ్రామస్తులను వివిధ సమావేశాలు, నిరసనలకు బలవంతంగా తీసుకెళ్తున్నారని'' పోలీసు సూపరింటెండెంట్ సునీల్ శర్మ చెప్పారు.