Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : శ్రీనగర్‌లో కళ్యాణ మండపాలను కూడా స్వాధీనం చేసుకోవడం, కాశ్మీర్ అంతటా కొత్త భద్రతా బంకర్లను నిర్మిస్తుండటం కాశ్మీర్ 'సాధారణం'గానే ఉందనే బిజెపి వాదనలను పటాపంచలు చేస్తున్నాయని సీపీఐ(ఎం) నాయకులు మహమ్మద్ యూసుఫ్ తరిగామి పేర్కొన్నారు. ప్రధాని మోడీ చెప్పిన 'అంతా బాగుంది' అంటే అర్ధం ఇదా అని తరిగామి ప్రశ్నించారు. కాజ్గింద్ ప్రాంతానికి చెందిన పార్టీ కార్యకర్తల సమావేశంలో తరిగామి మాట్లాడుతూ శ్రీనగర్‌లో ప్రతీ వీధి, ప్రతీ కార్నర్లోనూ భద్రతా బంకర్లు నిర్మిస్తున్నారని, కాశ్మీర్‌కు మరిన్ని పారామిలిటరీ కంపెనీలను రప్పిస్తున్నారని తెలిపారు. అదనపు భద్రతా సిబ్బందిని కళ్యాణ మండపాల్లో ఉంచుతున్నారని అన్నారు. ఇలాంటి విషయాలు 2019, ఆగష్టు 5 తరువాత జమ్ముకాశ్మీర్‌లో 'పురోగతి, అభివృద్ధి' గురించి బీజేపీ చేస్తున్న నకిలీ ప్రచారాన్ని బట్టబయలు చేస్తున్నాయని అన్నారు. అణచివేతకు మరిన్ని సాధానాలను సృష్టించడమే గత మూడు సంవత్సరాల్లో సాధించిన ఏకైక పురోగతి అని తరిగామి విమర్శించారు. ఎటువంటి పరిష్కార యంత్రాంగం లేదా రాజ్యంగ సంస్థ లేకుండా జమ్ముకాశ్మీర్‌ను ఒక 'నమూనా పోలీసు రాజ్యం'గా మార్చివేశారని తరిగామి ఆరోపించారు.