Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020లో 11,716 మంది వ్యాపారుల సూసైడ్ : నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో గతేడాది కరోనా మహమ్మారి సష్టించిన సంక్షోభ పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ సమయంలో రైతుల కంటే వ్యాపారవేత్తలే అధికంగా ఆత్మహత్యలు చేసుకున్నారని తాజాగా విడుదల చేసిన నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక పేర్కొంది. ఎన్సీఆర్బీ నివేదికలో ప్రస్తావించిన వివరాల ప్రకారం.. గతేడాది (2020)లో 11,716 మంది వ్యాపారవేత్తలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2019లో మొత్తం 9,052 మంది వ్యాపారవేత్తలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే 2019 నుంచి వ్యాపారవేత్తల మరణాలు 29 శాతం పెరిగాయి. ఇక 2020లో మొత్తం 10,677 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలతో పోలిస్తే.. వ్యాపారుల ఆత్మహత్యలు 1,039 అధికంగా ఉన్నాయి. అయితే, 2014 నుంచి 2019 మధ్య కాలంలో వ్యాపారుల కంటే రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రైతుల, వ్యాపారవేత్తల ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయని ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017లో 7,800 మంది వ్యాపారవేత్తలు ఆత్మహత్య చేసుకోగా, సంఖ్య 2019 నాటికి 9,000 దాటగా, 2020లో 11,700కి పెరిగింది. ఇదే సమయంలో 2017లో రైతు ఆత్మహత్యలు 10,700గా ఉండగా, 2018, 2019లో 10,300కి తగ్గాయి, మళ్లీ 2020లో 10,700 మార్కుకు చేరుకున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడ్డ వ్యాపారుల్లో 93 శాతం మంది పురుషులు ఉన్నారు. వెండర్లు 36, ట్రేడ్స్‌మెన్ 37 శాతం మంది ఉన్నారు. కాగా,వీరిలో చాలా మంది అభివృద్ధి చెందిన రాష్ట్రాల వారే కావడం గమనార్హం.2020లో కర్నాటకలో అత్యధికంగా (1,772) వ్యాపారవేత్తల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. కర్నాటక తర్వాతి స్థానంలో మహారాష్ట్రలో సుమారు 1,610 మంది వ్యాపారవేత్తలు ఆత్మహత్యలతో మరణించారు.
కారణాలేంటి?
2020లో వ్యాపారుల బలవన్మరణాలు పెరగడానికి కారణాలను ఎన్సీఆర్బీ స్పష్టంగా పేర్కొననప్పటికీ.. కరోనా మహమ్మారితో బలమైన సంబంధం కలిగివున్నాయని తెలుస్తోంది. ''గతేడాది రైతు ఆత్మహత్యలు మూడు శాతం, వ్యాపారుల ఆత్మహత్యలు 29 శాతం పెరిగాయని ఎన్సీఆర్బీ గణాంకాలు పేర్కొంటున్నాయి. భారత వ్యాపారవేత్తల సంఘంలో ప్రధాన వాటా మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ)లకు చెందినవారిది. కరోనా వీరిపై తీవ్ర ప్రభావం చూపుతూ.. కోలుకోలేని విధంగా దెబ్బకొట్టింది'' అని జేఎన్‌యూ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అండ్ ప్లానింగ్ ప్రొఫెసర్ ప్రవీణ్ ఝా అన్నారు. ''సంక్షోభ సమయంలో ఈ చిన్న వ్యాపారులకు మద్దతు ఉంటుందని హామీ లభించలేదు. ప్రభుత్వం వారికి చాలా తక్కువ, ఆలస్యంగా సహాయం చేసింది. చాలా తక్కువ సమయంలో ప్రపంచంలోనే అత్యంత అనాలోచిత లాక్‌డౌన్‌ను అనుభవించాల్సి వచ్చింది. సంక్షోభ సమయంలో సహాయక వ్యవస్థ లేకపోవడం వారిలో చాలా మందిని ఆత్మహత్యలకు పాల్పడేలా పరిస్థితులను మార్చివుండవచ్చు''నని ఝా అన్నారు. మహమ్మారి సమయంలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు పరిణామాలు కూడా ఈ విషయంలో తీవ్ర ప్రభావం చూపాయని నిపుణులు భావిస్తున్నారు.