Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అతిపెద్ద డైరీ కంపెనీలో కనీస జీతాలూ లేవు
- ప్రశ్నిస్తే ట్రాన్స్ఫర్లు, బలవంతపు రాజీనామాలు, తొలగింపులు..
- అమానవీయ పరిస్థితులను ఎదుర్కొంటున్న సిబ్బంది
- కార్మికులు, ఉద్యోగుల ఆందోళన
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద డైరీ ఉత్పత్తుల ప్రయివేటు కంపెనీగా పేరు గాంచింది 'హ్యాట్సన్ ఆగ్రో ప్రోడక్ట్స్'. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ఈ కంపెనీ టర్నోవర్ భారీగా పెరిగి రూ.5,500 కోట్లకు చేరుకున్నది. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ప్రస్తుతం 25 శాతం పెరుగుదల నమోదుకావడం గమనార్హం. అంతేకాదు, అదనంగా రూ. 450 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి, పంపిణీని విస్తరించే యోచనలో కంపెనీ ఉన్నట్టు సమాచారం. అయితే, తమిళనాడులో ఆ కంపెనీకి చెందిన కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది మాత్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ తమకు కనీస వేతనాలు దక్కడం లేదనీ, తీవ్ర శ్రమ దోపిడీ జరుగుతున్నదని ఇక్కడి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. అన్యాయంపై ప్రశ్నిస్తే బదిలీలు, బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నారని తెలిపారు. ఇక్కడి కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది అమానవీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని వివరించారు. ఒక్క తమిళనాడులోనే హెచ్ఏపీ కి చెందిన పదివేల మంది శాశ్వత, 22వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీలో యాజమాన్యం ప్రవర్తిస్తున్న కఠిన తీరుకు వ్యతిరేకంగా ధర్మపురి నగరంలోని కొలసనహళ్లి ప్లాంటు ఉద్యోగులు కొన్ని నెలల క్రితమే ఒక ట్రేడ్ యూనియన్ను ఏర్పాటు చేశారు.
అడ్డదారుల్లో లాభాలు
ఈ కంపెనీ గడిస్తున్న భారీ లాభాలు అక్రమ, అనైతిక మార్గాల ద్వారానే అని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. కంపెనీ ప్రధానంగా నాలుగు మార్గాల ద్వారా అధిక లాభాలను పొందుతున్నదని తమిళనాడు సీఐటీయూకు చెందిన నాగరాజ్ తెలిపారు. 'మొదటిది.. రైతుల వద్ద పాలను లీటరుకు రూ. 23 చొప్పున సేకరించి బయట రూ. 63కు కంపెనీ అమ్ముతుంది. రెండోది, ఇక్కడ పని చేసే కార్మికుడికి కంపెనీ చెల్లించేది రూ. 12 వేల కంటే తక్కువే. మూడోది, పర్యావరణ నిబంధనలకూ తూట్లు పొడుస్తూ పరిసర ప్రాంతాలను కలుషితం చేస్తుంది. ఇక చివరిది, ప్రజలకు ఉపాధి కల్పన పేరుతో మారుమూల ప్రాంతాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా కంపెనీ సబ్సీడీని పొందుతుంది. అయితే, ఈ కంపెనీ సబ్సీడీ ద్వారా లాభాలను పొందుతుంది కానీ కంపెనీ నుంచి స్థానికులకు ఒరిగేది ఏమీ లేదు'' అని ఆయన ఆరోపించారు.
బలవంతపు రాజీనామాలు
ఉత్తర తమిళనాడులోని కొలసనలహళ్లిలో గల హ్యాట్సన్ డైరీ ప్లాంట్ దేశంలోనే అతిపెద్దది. అయితే, ఇక్కడ మాత్రం కార్మికులకు మాత్రం ఉద్యోగ భద్రత లేదు. ''20-22 ఏండ్ల వయసున్న వారిని కంపెనీలో నియమించుకుంటారు. వారికి 30 ఏండ్లు రాగానే వారితో బలవంతంగా రాజీనామా చేయిస్తారు'' అని నాగరాజు ఆరోపించారు. '' ఏ ఒక్క కార్మికుడూ ఆరు నుంచి ఏడేండ్లకు మించి పని చేయకుండా కంపెనీ చేస్తుంది. ఒకవేళ వారు మనల్ని వద్దనుకుంటే గేటు బయట మనల్ని పడిగాపులు పడేలా చేస్తారు. కనీసం రూ. 8 వేల గ్రాట్యుటీ (ప్రతి నెల జీతం నుంచి కట్ అయ్యే రూ. 200 ద్వారా) అయినా లభిస్తుందన్న ఒక్క ఆశతో కార్మికులు రాజీనామా చేయాల్సి వస్తుంది'' అని కార్మిక నాయకుడు కార్తీక్ రాజా వివరించారు.
వేతనాలు అంతంతే.. దోపిడీ మాత్రం అధికం
కంపెనీల కార్మికులు వారి శ్రమకు తగిన వేతనాలను పొందక దోపిడీకి గురవుతున్నారని కార్మిక నాయకులు ఆరోపించారు. '' కంపెనీ కార్మికులకు రూ. 12వేలకు మించి చెల్లించదు. రికార్డులో ప్రతి ఉద్యోగికి రూ. 19వేలు చెల్లించినట్టు కనిపిస్తుంది. కానీ, మాకు (కార్మికులకు) దక్కేది రూ. 11,500 మాత్రమే'' అని కార్తీక్ రాజా తెలిపారు. ఇక కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి దారుణంగా ఉన్నది. '' కాగితాల మీద ప్రతి కార్మికుడి జీతం నెలకు రూ. 15 వేలుగా ఉంటుంది. కానీ, వాస్తవానికి వారికి దక్కేది రూ. 6వేలు మాత్రమే'' అని కార్తీక్ రాజా చెప్పారు. ఇక శాశ్వత ఉద్యోగులలా వీరిని డిస్మిస్ చేయకుండా వారి కాంట్రాక్టులను మారుస్తారనీ, జీతాలు రూ. 8వేలకు తక్కువగా ఉంటాయన్నారు. మధ్యాహ్నం సమయంలో కనీసం తిండి తినడానికి కూడా తమకు తగిన సమయం దొరకండ లేదని హ్యాట్సన్ వర్కర్స్ ఆరోపించారు. తాము చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నట్టు చెప్పారు.
ట్రేడ్ యూనియన్ ఏర్పాటు.. ఉద్యోగుల తొలగింపు
కంపెనీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఇక్కడ సీఐటీయూ ట్రేడ్ యూనియన్ ఏర్పాటైంది. అయితే, ఇందులో కీలకంగా వ్యవహరించిన నలుగురు కార్మికులు మాత్రం ఏపీ, మహారాష్ట్రలకు బదిలీ అయ్యారు. లేబర్ డిపార్ట్మెంట్ను ట్రేడ్ యూనియన్ ఆశ్రయించినందుకు నిబంధనలకు విరుద్ధంగా మరో ఐదుగురిని కంపెనీ ట్రాన్స్ఫర్ చేయడం గమనార్హం. నిబంధనలను ఉల్లంఘిస్తున్న కంపెనీ చర్యలను నిరసిస్తూ 96 మంది పర్మనెంట్, 48 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆకస్మిక సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే, అత్యవసర సేవలను ఉటంకిస్తూ పోలీసులు వారిని అరెస్టు చేశారనీ, దీనిని ఖండిస్తూ తాము నిరసన తెలిపామని నాగరాజు చెప్పారు. కాగా, సమ్మెలో పాల్గొన్న కాంట్రాక్టు కార్మికులు తొలగింపునకు గురి కాగా, పర్మనెంట్ ఉద్యోగులు బదిలీ వేటుకు గురికావడం గమనార్హం.