Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మేఘాలయ గవర్నర్
జైపూర్: ఒక జంతువు చనిపోయినప్పుడు కూడా సంతాపం వ్యక్తం చేస్తారు. కానీ, కొన్నాళ్లుగా సాగుతున్న నిరసనల్లో దాదాపు 600 మంది రైతులు మరణించినా.. లోక్సభలో కనీసం వారి ప్రస్తావన తీసుకురాలేదు' అని కేంద్ర ప్రభుత్వ నేతలపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పరోక్షంగా విమర్శించారు. రైతు నిరసనలు, అవినీతి తదితర విషయాల్లో గత కొన్నాళ్లుగా వరుస షాకింగ్ కామెంట్లు చేస్తున్న మేఘాలయ గవర్నర్ ఆదివారం ఆయన జైపుర్లో ఓ కార్యక్రమంలో పై విధంగా వ్యాఖ్యలు చేశారు. తాను రైతు నిరసనలపై మాట్లాడినప్పుడల్లా అది వివాదాస్పదమవుతోందని, దీంతో ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుందేమో ఆలోచించాల్సి వస్తోందని అన్నారు.
'వారు కోరితే.. పదవి వదిలేస్తా': 'గవర్నర్ను తొలగించలేరు. కానీ.. కొంతమంది మాత్రం నేనేమైనా వివాదాస్పదంగా మాట్లాడాలి.. ఫలితంగా పదవి కోల్పోవాలి.. అని ఎదురుచూస్తున్నారు. నాకు తెలుసు.. నేను దిల్లీ నేతలకు విరుద్ధంగా మాట్లాడుతున్నా. ఒకవేళ వారు పదవి వదులుకోవాలని కోరితే.. ఒక్క నిమిషం కూడ ఆలస్యం చేయను' అని సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యానించారు. రైతు చట్టాల విషయంలో అన్నదాతల డిమాండ్లు నెరవేర్చాలని ఆయన గతంలోనూ కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కర్షకుల డిమాండ్లు తీర్చకపోతే బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించడం అప్పట్లో చర్చనీయాంశమైంది.