Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సదస్సులో వి.శ్రీనివాసరావు, ఆర్.అరుణ్‌కుమార్
గన్నవరం: రష్యన్ విప్లవ స్ఫూర్తితో రానున్న కాలంలో ప్రజా పోరాటాలను విస్తృతం చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు, ఆర్.అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకూ జరగనున్న సిపిఎం కృష్ణా జిల్లా (తూర్పు) కమిటీ ద్వితీయ మహాసభను పురస్కరించుకుని ఆదివారం గన్నవరంలో రష్యన్ విప్లవ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 'రష్యన్ కార్మికవర్గ విప్లవర ఎందుకు జయప్రదమైంది? ఏమి సాధించింది' అనే అంశంపై అరుణ్ కుమార్ మాట్లాడుతూ క్రమశిక్షణ, నిజాయితీ, నిరంతరం ప్రజల మధ్య ఉండడం, సమస్యలపై వారిని చైతన్యపరిచి ఉద్యమాల్లోకి తీసుకురావడం, వర్గశత్రువుతో రాజీలేని పోరాటాల ద్వారానే విప్లవాన్ని సాధించగలమని రష్యన్ విప్లవ అనుభవం చాటుతోందన్నారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలుతో మన దేశంలో ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాలు పెరుగుతున్నాయని తెలిపారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పెద్ద ఎత్తున భారాలు మోపుతున్నాయన్నారు. సమస్యలతో సతమతమవుతున్న ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని కోరారు. సదస్సుకు సిపిఎం తూర్పు కృష్ణా కార్యదర్శివర్గ సభ్యులు వై.నరసింహారావు అధ్యక్షత వహించారు. తొలుత సిపిఎం తూర్పు కృష్ణా కార్యదర్శి ఆర్.రఘు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఆ తర్వాత 'రష్యన్ విప్లవం-నేటి ప్రాసంగికత' అంశంపై వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, దీన్ని అధిగమించి సమాజం వేగంగా పురోగమించాలంటే సోషలిజం సాధనే మార్గమని తెలిపారు. సోషలిస్టు రష్యాలో 72 సంవత్సరాలపాటు సంక్షోభం కనిపించలేదన్నారు. ఆకలి, నిరుద్యోగం రూపుమాశాయని తెలిపారు. అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ వర్గ పోరాటాన్ని విస్మరించడంతోనే రష్యాలో సోషలిజం కూలిందన్నారు. సోషలిస్టు వ్యవస్థ పతనం తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ రావడంతోనే రష్యాలో ఆకలి, నిరుద్యోగం ఉధృతరూపం దాల్చాయని తెలిపారు. ప్రజలంతా మళ్లీ గతకాలపు సోషలిస్టు వ్యవస్థను గుర్తు చేసుకుంటున్నారని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులకు 19 శాతం ఓట్లు రావడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సదస్సుకు సిపిఎం తూర్పు కృష్ణా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.హరిబాబు అధ్యక్షత వహించారు.