Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ మరణాలు 50 లక్షలు దాటినా
- భారత్‌లో అధికారికంగా చూపిన వాటికన్నా 8-10 రెట్లు అధికంగా మరణాలు
న్యూఢిల్లీ: వేసవి తరువాత డెల్టా వైరస్ ఉధృతి తగ్గినప్పటికీ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ పెద్దయెత్తున చేపట్టినప్పటికీ యూరప్, ఆగేయాసియాలో కరోనా మరణాల రేటు హఠాత్తుగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చైనాలోని వుహాన్‌లో 2020 జనవరి9న 61 ఏళ్ల వ్యక్తి కోవిడ్ బారిన పడి చనిపోయాడు. ఈ తొలి కోవిడ్ మరణం చోటుచేసుకుని నేటికి 22 మాసాలు అవుతోంది. ఈ కాలంలో ప్రపంచ వ్యాపితంగా 50 లక్షల మంది దాకా కోవిడ్‌తో చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారిక లెక్కలను బట్టి చూస్తే మృతుల సంఖ్య అనేక రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. వీటిలో అత్యధిక భాగం అంటే 7.5 లక్షల మరణాలు అమెరికాలో చోటుచేసుకున్నాయి. 6లక్షల మరణాలతో బ్రెజిల్, 4.5 లక్షల మరణాలతో భారత్, 2.8 లక్షల మరణాలతో మెక్సికో, 2.3 లక్షల మరణాలతో రష్యా ఆ తరువాతి స్థానాల్లో వరుసగా నిలిచాయి. వారానికి సగటున 50వేల మందికిపైగా చనిపోతున్నారు. ఈ ఏడాది వేసవిలో కోవిడ్ మహమ్మారి పెద్దయెత్తున విరుచుకుపడడంతో జులై7 నాటికి ప్రపంచ వ్యాపితంగా కోవిడ్ మృతుల సంఖ్య 40 లక్షలకు చేరుకుంది. ఇప్పటికీ చాలా దేశాల్లో డెల్టా వేరియంట్ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్లు వేయించుకున్న దేశాల్లో సైతం కోవిడ్ మరణాలు ఆగడం లేదు. కోవిడ్‌ను సమర్థవంతంగా నివారించడంలో వ్యాక్సిన్లు సరిగా పనిచేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. 2020 సెప్టెంబరు8 నాటికి అంటే తొలి మరణం సంభవించిన తరువాత ఎనిమిది మాసాలకు మొదటి పది లక్షల మరణాలు నమోదయ్యాయి. ఆ తరువాత మూడున్నర మాసాలకు అంటే ఈ ఏడాది జనవరి15 నాటికి 20 లక్షల మార్కు దాటింది. అటుపిమ్మట మూడు మాసాలకే అంటే ఏప్రిల్ 17 నాటికి ఈ మరణాలు ముప్పయి లక్షలకు చేరాయి. జులై7 నాటికి 40 లక్షలు దాటాయి. అక్టోబరు చివరి వారంలో యూరోపియన్ దేశాల్లో 14 శాతం, ఆగేయాసియా దేశాల్లో 13 శాతంగా వారం వారీ మరణాల రేటు నమోదయింది. డబ్ల్యుహెచ్ఓ వెల్లడించిన వివరాల ప్రకారం అంతకుముందు వారంతో పోల్చితే గత వారం పది శాతానికి పైగా కోవిడ్ మరణాల రేటు నమోదయిన దేశాల జాబితా 56కి పెరిగింఇ. గత రెండు మాసాల్లో కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి. డబ్ల్యుహెచ్ఓ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రెయెసస్ అక్టోబరు 28న ఒక ప్రకటన చేస్తూ, ప్రపంచానికి కోవిడ్-19 మహమ్మారి ముప్పు ఇంకా తొలగలేదని మరోమారు హెచ్చరించారు. వ్యాక్సిన్ల పంపిణీలో అసమానతలు కూడా ప్రపంచ వ్యాపితంగా మరణాల పెరుగుదలకు ఒక కారణం. వ్యాక్సిన్ల పంపిణీలో అసమాతల వల్ల అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉండడం లేదు. వ్యాక్సిన్లు పుష్కలంగా ఉన్న దేశాల్లో వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రజలు సంకోచిస్తున్న పరిస్థితి. అల్పాదాయ దేశాల కన్నా అధిక ఆదాయ దేశాల్లో 30 రెట్లు ఎక్కువగా టీకాలు వేసినట్లు డబ్ల్యుహెచ్ఓ చీఫ్ తెలిపారు. బిఎంజె న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం అల్పాదాయ దేశాల్లో 1.3 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్లు అందాయి. 70 దేశాలు ఇప్పటివరకు తమ జనాభాలో పది శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశాయి. ఆఫ్రికాతో సహా 30 దేశాలు 2 శాతం కన్నా తక్కువ మందికి టీకాలు వేశాయి. లాటిన్ అమెరికాలో ప్రతి నల్గురిలో ఒకరికి మాత్రమే సింగిల్ డోస్ అందింది. ప్రతి దేశం తమ జనాభాలో 40 శాతం మందికి టీకాలు అందించేందుకు వీలుగా బూస్టర్ డోసులపై తాత్కాలిక నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగించినప్పటికీ వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.కోవిడ్ మరణాలు 50 లక్షలకు చేరుకోవడంపై డబ్ల్యుహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త డా. సౌమ్య స్వామినాథన్ ట్వీట్ చేస్తూ ప్రపంచవ్యాపితంగానే మరణాలను తగ్గించి చూపుతున్నారని పేర్కొన్నారు. నిజానికి ఈ మరణాల సంఖ్య కోటిన్నర దాకా ఉంటుందని అన్నారు. కోవిడ్ మరణాలను తగ్గించి చూపుతున్న విషయాన్ని డబ్ల్యుహెచ్ఓ చీఫ్ కూడా ప్రస్తావించారు. 'ప్రపంచ వ్యాపితంగా ఇప్పటివరకు 50 లక్షల మరణాలే నమోదయ్యాయి. వాస్తవ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని మాకు తెలుసు' అని టెడ్రోస్ పేర్కొన్నారు. వాస్తవంగా ప్రపంచ కరోనా మృతుల సంఖ్య ఇప్పుడు పేర్కొన్నదాని కన్నా రెండింతలు అధికంగా ఉంటుందని న్యూయార్క్ సిటీ యూనివర్సిటీలో పబ్లిక్ హెల్త్, హెల్త్ పాలసీ గ్రాడ్యుయేట్ స్కూల్ విభాగంలో అంటువ్యాధుల నిపుణుడు డా. డెనిస్ నాష్ న్యూయార్క్‌టైమ్స్‌కు తెలిపారు. జెరూసలెం లోని హిబ్రూ యూనివర్సిటీకి చెందిన అరియల్ కార్లిన్స్కీ, జర్మనీలోని తుబెంగిన్ యూనివర్సిటీకి చెందిన డిమిట్రి కొబాక్ ఈ ఇద్దరు పరిశోధకులు వందకుపైగా దేశాల నుంచి మరణాలకు సంబంధించిన డేటాను సంకలనం చేసి వరల్డు మోర్టాలిటీ డేటాసెట్‌ను రూపొందించారు. వరల్డు మోర్టాలిటీ డేటాసెట్ లో లభించిన డేటాను ఆధారంగా చేసుకుని పరిశోధకుల బృందం 103 దేశాల్లో కోవిడ్ సమయంలో అధికారికంగా పేర్కొన్న వాటి కన్నా చాలా ఎక్కువ మరణాలు చోటుచేసుకున్నట్లు గుర్తించారు, ఈ వివరాలను ఈ లైఫ్‌లో వారు ప్రచురించారు. కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన పెరూ, ఈక్వెడార్, బొలీవియా, మెక్సికో వంటి దేశాల్లో వాస్తవంగా చోటు చేసుకున్న మరణాల్లో సగం మాత్రమే నమోదయ్యాయని వారు తెలిపారు. బెలారస్, ఈజిప్టు, ఉజ్బెకిస్తాన్, నికరాగ్వాలలో అధికారికంగా చూపిన వాటికన్నా వాస్తవ మరణాల సంఖ్య పదింతలు అధికంగా ఉన్నట్లు తేల్చారు. భారత దేశం విషయానికి వస్తే కోవిడ్-19 మరణాలను చాలా తగ్గించి చూపిందన్నారు. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సిఆర్ఎస్) ఎనిమిది రాష్ట్రాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా చూస్తే అధికారికంగా చూపిన మరణాల సంఖ్య కంటె వాస్తవ మరణాల సంఖ్య 8.22 రెట్లు అధికంగా ఉన్నట్లు ' ది హిందూ' పత్రిక అంచనా వేసింది. ఈ కాలంలో మొత్తంగా 37.8 లక్షల దాకా అదనపు మరణాలు చోటు చేసుకున్నాయి.
అన్ని అదనపు మరణాలు కోవిడ్ వల్లే జరిగాయని చెప్పలేకున్నా వీటిలో అత్యధిక భాగం ఈ మహమ్మారి వల్ల సంభవించినవేనని చెప్పవచ్చు. ఈ లెక్కన చూస్తే కోవిడ్ మరణాలు అత్యధికంగా సంభవించిన దేశాల్లో భారత్ అగ్రభాగాన ఉంటుంది. జాతీయ జనాభాలో 60 శాతం మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 12 రాష్ట్రాల నుంచి సేకరించిన అన్ని రకాల మరణాల డేటా ఆధారంగా లండన్‌లోని మిడిలెసెక్స్ యూనివర్సిటీకి చెందిన మురాద్ బనాజీ, హార్వర్డ్ యూనివర్సిటీ చెందిన ఆశిష్ గుప్తా విశ్లేషించి, నిర్ధారించిన దాని ప్రకారం అధికారికంగా నమోదైన వాటి కన్నా 8-10 రెట్లు అధికంగా వాస్తవిక మరణాలు ఉన్నాయి. ఈ వివరాలను ప్రి ప్రింట్ సర్వర్ 'మెడ్ ఆర్ ఎక్స్ఐవి' లో అక్టోబరులో పోస్ట్ చేయడం జరిగింది. వీటిని ప్రింట్స్ సమీక్షించి, సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించనుంది.
యాంటీ వైరల్ డ్రగ్స్
కోవిడ్-19పై పోరాడేందుకు, అలాగే మరణాలను తగ్గించేందుకు నవంబరు 4న బ్రిటన్ డ్రగ్ రెగ్యులేటర్ మరో బూస్టర్ షాట్‌ను సిఫారసు చేసింది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు కోవిడ్ వైరస్‌ను ఎదుర్కొంటూ, రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న పెద్దలకు (60ఏళ్లు పైబడినవారికి), స్థూల కాయం, మధుమేహం, గుండె జబ్బులున్నవారికి మోల్నో పిరవిర్ అనే ఈ బూస్టర్ షాట్‌ను ఉపయోగించేందుకు అది సిఫారసు చేసింది. కోవిడ్ పాజిటివ్ అని తేలిన తరువాత, ఆ లక్షణాలున్నట్లు తేలిన అయిదు రోజుల్లో ఇంటి వద్దనే నోటి ద్వారా ఈ ఔషధాన్ని తీసుకోవచ్చు. ఇది అత్యంత హాని కలిగించే, రోగనిరోధక శక్తిని దెబ్బతీసే వైరస్ నుంచి కాపాడడంలో కీలకంగా ఉండబోతుందని, ఇది త్వరలోనే అందుబాటులోకి రానుందని బ్రిటన్ ఆరోగ్య, సామాజిక భద్రత శాఖ మంత్రి సాజిద్ జావిద్ ఒక ప్రకటనలో తెలిపారు. మోల్ను పిరవీర్ డ్రగ్‌ను ఈ ఏడాది చివరి నాటికి కోటి డోసుల దాకా ఉత్పత్తి చేయనన్నట్లు మెర్క్ కంపెనీ తెలిపింది. వచ్చే ఏడాది చివరి నాటికి దీనిని 2కోట్ల డోసులకు పెంచుతామన్నది. ఈ డ్రగ్ కోసం అమెరికా, బ్రిటన్‌తో సహా పలు దేశాలు మెర్క్ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
తెలంగాణలో122 మందికి కరోనా : ఇద్దరి మరణం
రాష్ట్రంలో కొత్తగా 122 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు. శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు 25,947 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 21,847 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 3,766 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 730 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,764 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 46 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా ఏడు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో 11 జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.