Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నైలో జనజీవనం అస్తవ్యస్తం.. లోకల్ రైళ్లు నిలిపివేత
- లోతట్టు ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటన
చెన్నై : ఉత్తర కోస్తా తమిళనాడును భారీ వర్షం ముంచెత్తింది. చెన్నైతో పాటు మరో మూడు జిల్లాల్లో వరదలు విజృంభణతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి చెన్నై నీట మునిగింది. కొరటూర్,పెరంబూర్,అన్నాసలై, టి.నగర్,గిండి, అడయార్, పెరుంగుడి ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.2015 తర్వాత ఇంత భారీస్థాయిలో వర్షం కురవడం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.శనివారం రాత్రి చెన్నైలో 20సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్కు చెందిన నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. చెంగల్పట్టు, తిరువళ్లూరులో ఒక్కో బృందం, మధురైలో రెండు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కన్యాకుమారి,కాంచీపురం,మధురైలోనూ భారీ వర్షాలు కురవడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. చెన్నైలో మోకాలు లోతు నీటిలో వాహనాలు రాకపోకలు సాగించాయి. భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో లోకల్ రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. చెంబక్కరపాకం, పుళల్ రిజ్వరాయర్లు నిండుకుండలా మారాయనీ..ఏ క్షణమైనా డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ముంపు ప్రాంతాల్లో సీఎం స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమీక్షా సమావేశాలకే పరిమితం కాకుండా...ఉత్తర చెన్నైలోని ముంపు ప్రాంతాలను సందర్శించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ స్థాయిలను నిశితంగా పర్యవేక్షించాలని సీఎం సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలనీ, వరద ప్రభావిత జిల్లాల్లో రెండు రోజులపాటు పాఠశాలలు, కళాశాలలను మూసివేశాలని ఆయా జిల్లాల కలెక్టర్లను స్టాలిన్ ఆదేశించారు. భారీ వర్షం కారణంగా రోడ్డు, రైలు సర్వీసులు దెబ్బతిన్నాయి. కొన్ని విమానాలు ఆలస్యమైనప్పటికీ, విమాన సర్వీసుల్లో పెద్దగా అంతరాయం కలగలేదని అధికారవర్గాలు తెలిపాయి.