Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్ద నోట్ల రద్దు విఫల ప్రయోగం
- కేంద్రం చెప్పిన ఏ ఒక్క లక్ష్యమూ నెరవేరలేదు
- మోడీ సర్కారు నిర్ణయంతో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ
- నానా ఇబ్బందులు.. అణగారిన వర్గాలపై తీవ్ర ప్రభావం : ఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ : దేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగి నేటికి సరిగ్గా ఐదేండ్లు పూర్తవుతున్నది. 2016, నవంబర్ 8న దేశ ప్రజలనుద్దేశించి సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో నోట్ల రద్దు గురించి ప్రధాని మోడీ ప్రకటన చేశారు. 'నల్ల ధనాన్ని నిర్మూలించడం, దేశంలో నకిలీ కరెన్సీ మూలాలను తొలగించడం, ఉగ్రవాద గ్రూపులకు అందే నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం' అనేవి నోట్ల రద్దు మూడు ప్రధాన లక్ష్యాలుగా కేంద్రం పేర్కొన్నది. అయితే, కేంద్రం చెప్పిన లక్ష్యాల్లో ఏ ఒక్కటీ నెరవేరకపోగా దేశ ఆర్థిక వ్యవస్థను ప్రమాదపుటంచునకు తీసుకెళ్లిందని ఆర్థిక నిపుణులు తెలిపారు. నోట్ల రద్దు అనేది ఒక పీడకల అని వివరించారు. నోట్ల రద్దు ద్వారా కలిగిన ప్రయోజన మేమిటో తదుపరి జరిగిన ఎన్నికల ప్రచారాల్లో ప్రజలకు వివరించే సాహసం కేంద్రం, బీజేపీ చేయలేకపోయిందనీ, మోడీ సర్కారు నిర్ణయం విఫలమైందనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత దేశంలో ప్రధానంగా ఇబ్బందులను అనుభవించింది పేద, మధ్య తరగతి ప్రజలేనని ఆర్థిక నిపుణులు తెలిపారు. నవంబర్ 8 రాత్రి మోడీ ప్రకటన తర్వాత తమ వద్ద ఉన్న పాతనోట్లను కొత్త నోట్లతో మార్చుకోవడానికి వారు బ్యాంకులు, ఏటీఎంల ముందు భారీ క్యూల్లో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అయితే, కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టకపోవ డంతో దేశంలో నోట్ల రద్దు కష్టాల తంతు సుదీర్ఘ కాలం పాటు కొనసాగిందని ఆరోపించారు. '' దేశ ఆర్థిక వ్యవస్థ కొన్ని నెలల పాటు దెబ్బతిన్నది. తమ నిర్ణయం ఒక పెద్ద మాస్టర్స్టోక్ అవుతుందని అనుకున్న కేంద్రానికి ఊహించని డిజాస్టర్‌గా మిగిలిపోయింది'' అని విశ్లేషకులు వివరించారు.
బ్యాంకులకు చేరిన 99 శాతం నగదు
నోట్ల రద్దు సమయానికి దేశంలో సర్క్యులేషన్లో ఉన్న మొత్తం కరెన్సీ విలువ రూ. 18 లక్షల కోట్లు. ఇందులో రద్దయిన పెద్ద నోట్లు రూ. 1000, రూ. 500 నోట్ల వాటా 85శాతం. నకిలీ కరెన్సీ, నల్లధనం లో వీటి వాటానే అధిక మన్నది అందరికీ తెలిసిందే.
అయితే, 'పెద్దలు' మాత్రం తమ వద్ద ఉన్న 'నల్లధనాన్ని' సులువుగా గట్టెక్కించుకోగలి గారు. ఇందుకు కొందరు బ్యాంకర్లు 30శాతం ఛార్జీతో వారికి సహాయం అందించారని వార్తలు వెలువడ్డాయి. అలాగే, మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జన్‌ధన్ ఖాతాలూ దుర్వినియోగమయ్యాయి. మరీముఖ్యంగా, కేం ద్రం తీసుకొచ్చిన రూ. 2000 వేల నోటు 'పెద్దల' సమస్యను మరింత సులువుగా పరిష్కరించగలిగింది. కొన్ని అంచనాల ప్రకారం.. 2017, జనవరి 10 నాటికి రద్దయిన నోట్లలో 99 శాతం తిరిగి బ్యాంకులకు చేరుకున్నది. ఈ విషయాన్ని సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అదే ఏడాది ఆగష్టులో వెల్లడించడం గమనార్హం.
రాజకీయ లబ్ది కోసమే..
విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తే దేశంలోని ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షలను పొందొచ్చని 2014 ఎన్నికల ప్రచారాల్లో మోడీ ప్రచారం చేశారు. అయితే, ఇది మాత్రం ఒక ''జుమ్లా (అబద్ధపు హామీ)'' గా మిగిలిపోయిందని విశ్లేషకులు గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని చవిచూసింది.
దీంతో నల్లధనం విషయంలో ఏదో ఒకటి చేస్తున్నామనే భావన కల్పించి రాజకీయంగా లబ్ది పొందాలని మోడీ సర్కారు భావించిం దని విశ్లేషకులు తెలిపారు. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు కేంద్రం చేసింది. అదే ఏడాది బ్లాక్ మనీ (అన్డిస్క్లోస్డ్ ఫారిన్ ఇన్కమ్ అండ్ అస్సెట్స్) అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్‌ను ఆమోదించింది. 2016 బడ్జెట్లో భాగంగా ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. అయితే, ఇవేమీ అంతగా ప్రభావం చూపలేకపోయాయి.
సరిగ్గా యూపీ ఎన్నికలకు ముందు..
దీంతో సరిగ్గా యూపీ ఎన్నికలకు ముందు పెద్ద నోట్ల రద్దును మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. నకిలీ నోట్ల రద్దు, విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకురాగలమన్న నమ్మ కాన్ని జనాల్లో కలిగించి ఓట్లను రాబట్టుకోవాలని బీజేపీ భావించింది. అలాగే, పెద్ద నోట్ల రద్దు ద్వారా యూపీలోని రాజకీయ పార్టీల ఆర్థిక వనరులకు చెక్ పెట్టి వారిని దెబ్బ తీయాలని బీజేపీ భావించింది. అయితే, దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందాలనుకోవడమూ పెద్ద నోట్ల రద్దుకు ఒక కారణమని విశ్లేషకులు తెలిపారు.
నగదు రహితం.. ఆర్థికానికి భారం
పెద్ద నోట్ల రద్దు విఫలం కావడంతో కేంద్రం, బీజేపీలు తమ ప్రచారాన్ని మరో కోణంలోకి తీసుకెళ్లాయి. డీమానిటై జేషన్ కారణంగానే దేశంలో నగదు రహిత లావాదేవీలు (క్యాష్‌లెస్ ఎకనామి) పెరిగాయని ప్రచారాన్ని మొదలు పెట్టాయి. అయితే, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుం గదీసిందని ఆర్థిక నిపుణులు తెలిపారు. దేశంలో ఒకే సారిగా దాదాపు 85 శాతం నగదు సర్క్యులేషన్లో లేకపోవడం, దానిని పూరించడానికి దాదాపు ఒక ఏడాది పాటు సమయం పట్టడంతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని చెప్పారు.
అసంఘటిత రంగం ఆగమాగం
దేశ ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగానిది కీలక పాత్ర. ఈ రంగంలో దాదాపు 94 శాతం శ్రామిక శక్తి ఉన్నది. ఇందులో ఉండే సూక్ష్మ, చిన్న తరహా యూనిట్లు మాత్రం నడిచేది కేవలం నగదుతోనే. అయితే, నోట్ల రద్దు సమయంలో ఈ రంగం నగదు కొరతను ఎదుర్కొన్నది. ఫలితంగా దీనిపై ఆధారపడి ప్రజలు తమ ఆదాయాన్ని కోల్పోయారు. దీంతో ఆ సమయంలో ఈ రంగం శక్తి మేర పనిచేయలేకపోయింది. అయితే, 2016-17 దశాబ్దపు అధిక పెరుగుదల రేటును నమోదు చేసిందని ప్రభుత్వ గణాంకాలు చూపెట్టాయి. అసంఘటిత రంగాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం గణాంకాలతో తప్పుదారి పట్టించిందని నిపుణులు వివరించారు. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లిందని తేలేదని అభిప్రాయపడ్డారు.
నోట్ల రద్దు తీసుకొచ్చిన కష్టాలు సుదీర్ఘకాలం కొనసా గాయి. దేశంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయింది. ఆర్థిక అసమానతలు శిఖరస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా, మహిళలు, రైతులు, కార్మికులతో పాటు అణగారిన వర్గాల పై నోట్ల రద్దు ప్రతికూల ప్రభావాలను చూపించిందని నిపుణులు, విశ్లేషకులు తెలిపారు.