Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో కదంతొక్కిన పౌర సమాజం
- మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై కన్నెర్ర
- కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువత, కళాకారులు హాజరు
న్యూఢిల్లీ : ప్రజా సమస్యలపై పౌర సమాజం కదం తొక్కింది. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువత, కళాకారులు గొంతెత్తారు. ఆదివారం నాడిక్కడ పౌరు సమాజం భారీ ప్రదర్శన నిర్వహించారు. రాంలీలా మైదానం ముందున్న జాకీర్ హుస్సేన్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ తుర్క్‌మన్ గేట్ వద్ద బహిరంగ సభతో ముగిసింది. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీ, ప్రదర్శనలో వందలాది మంది కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, కళాకారులు పాల్గొన్నారు. నవంబర్ 25 సమ్మెను విజయవంతం చేయాలని బహిరంగ సభలో తీర్మానం చేశారు.
సీఐటీయూ అధ్యక్షురాలు కె.హేమలత, ఢిల్లీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాగ్ సక్సేనా, ఐద్వా ఢిల్లీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మెమునా మొల్లా, ఆశాశర్మ, డీవైఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు సంజరు కుమార్, ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి మయంక్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. దేశంలో ధరలు పెరుగుదల, ప్రజా పోరాటాల గురించి మాట్లాడుతూ రష్యన్ విప్లవం వార్షికోత్సవాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. దేశంలో నిరంతరంగా పెరుగుతున్న ధరల పెరుగుదల సామాన్య ప్రజలపై తీవ్ర భారం అవుతుందని, గత రెండేండ్లుగా నిరుద్యోగం, లాక్డౌన్ కారణంగా సామాన్యుల జీతాలు తగ్గిపోతున్నాయనీ, మరోవైపు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, వంట నూనె, కూరగాయలు, పప్పులు ఇలా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని తెలిపారు. సామాన్య కుటుంబాలకు జీవనం దుర్భరంగా మారిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఆశించినరీతిలో స్పందిచటంలేదనీ, గద్దెనెక్కిన ప్రభుత్వ మంత్రులు అధికార మత్తులో జోగుతున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం తన ధనిక మిత్రులపై పన్ను విధించడానికి ఇష్ట పడటం లేదనీ, కానీ నిరుద్యోగం, ఆకలితో బాధపడుతున్న కార్మికులపై రూ.1.5 లక్షల కోట్ల అదనపు భారాన్ని మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో ఉన్న 116 దేశాలలో ఇటీవలి సర్వేలో భారత్ 101వ స్థానంలో ఉన్నదనీ, లాక్డౌన్ తర్వాత అన్ని సర్వేలు 60 శాతం మంది ప్రజలు మునుపటి కంటే తక్కువ ఆహారం తీసుకుంటున్నట్లు స్పష్టం చేస్తున్నాయని గుర్తు చేశారు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) పేరుతో 22 శాతం జాతీయ రహదార్లు, 400 రైల్వే స్టేషన్లు, 1,400 కిలో మీటర్ల రైలు మార్గాలు, 90 రైళ్లు, 25 విమానాశ్రయాలు, 160 గనులు, 9 ఓడరేవుల్లోని 31 ప్రాజెక్టులు మొదలైన దేశ అపారమైన సంపదను దేశీయ, విదేశీ కార్పొరేట్లకు అప్పన్నంగా దోచిపెట్టేందుకు సిద్ధపడిందని విమర్శించారు. ధరలు పెరుగుదల, నిరుద్యోగం, అసమానత, కరోనా సంక్షోభం వంటి సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో దేశ సంపదను మోడీ తన స్నేహితులకు ఇచ్చేందుకు తీసుకున్న చర్యలు దేశహితానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. 2014-2018 మధ్య కాలంలో రోజుకు రూ.10 కోట్లు సంపాదించిన పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చడంపై మోడీ ప్రభుత్వం పూర్తి దృషి ్ట పెట్టిందన్నారు. కేంద్రీకరించిందనీ, మన ఓట్లతో ప్రభుత్వంలోకి వచ్చిన మోడీ సర్కార్, కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.
ఇటీవలి దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓడిపోయిన బీజేపీ పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గిస్తామంటూ ప్రచారం చేస్తున్నప్పటికీ, వాస్తవంగా ప్రజలకు ఊరట లభించడం లేదని పేర్కొన్నారు. పెట్రోల్ ధరలో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ రూ. లీటరుకు 0, అదే విధంగా డీజిల్ లీటరుకు రూ. 0 అయితేనే.. దేశంలోని సామాన్యులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు, మిగతా నిత్యవసర వస్తువులు, ఇతర వస్తువల అన్నింటి ధరలపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ధరలు పెరుగుదలకు వ్యతిరేకంగా, జోవనోపాధి, ఉపాధి పరిరక్షణ కోసం ప్రచారోధ్యమం కొనసాగుతోందని, నవంబర్ 25న సమ్మెలో దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన ప్రతిఘటన మోడీ సర్కార్ ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఐద్వా, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎంఎం, డీటీఎఫ్, ఐలు, ఏఐకేఎస్, ఎల్ఐసీ, జనం, జెఎల్ఎస్, డీఎస్ఎఫ్్ తదితర సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.