Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఉద్యమంలో పెద్ద రైతులే ఉన్నారన్న ప్రచారం తప్పు
- ఢిల్లీ ఆందోళనల్లో అమరులైనవారిలో చిన్న, సన్నకారు రైతులు
- మూడు ఎకరాల కంటే తక్కువ భూమి కలవారే : పంజాబ్ యూనివర్సిటీ ఆర్థిక వేత్తల అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ : మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న చారిత్రాత్మక ఉద్యమంలో త్యాగాలు చేసిన అమరవీరుల్లో చిన్న, సన్నకారు రైతులే అధికంగా ఉన్నారు. మూడు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన రైతులే ఎక్కువ మంది మరణించారని పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ఆర్థిక వేత్తల నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని సాగుదారుల (కౌలు రైతులు)ని అధ్యయనం స్పష్టం చేస్తుంది. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనల వెనుక 'పెద్ద రైతులు (భూస్వాములు)' ఎక్కువగా ఉన్నారనే వాదనకు భిన్నంగా, పాటియాలాలోని పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ఆర్థికవేత్తలు జరిపిన అధ్యయనంలో నిరసనలో మరణించిన వారు సగటున 2.94 ఎకరాల భూమి కంటే ఎక్కువ సాగు చేయలేదని తేలింది.
నిర్విరామంగా కొనసాగుతున్న రైతు ఉద్యమం నవంబర్ 26 నాటికి ఏడాది పూర్తి చేసుకుంటుంది. ఈ ఉద్యమంలో ఇప్పటి వరకు దాదాపు 700 మంది రైతులు మరణించారు. పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర మాజీ ప్రొఫెసర్ లఖ్వీందర్ సింగ్, భటిండాలోని పంజాబీ యూనివర్సిటీ గురు కాశీ క్యాంపస్లో సామాజిక శాస్త్రాల అసిస్టెంట్ ప్రొఫెసర్ బల్దేవ్ సింగ్ షెర్గిల్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, ''వ్యవసాయం చేస్తున్న భూమిలేని (కౌలు రైతులు) మరణించిన రైతులను కలుపుకుంటే, సాగు చేసిన విస్తీర్ణం సగటు పరిమాణం 2.26 ఎకరాల కంటే తక్కువ ఉంటుంది'' అని స్పష్టం చేసింది.
లఖ్వీందర్ సింగ్ వివరాల ప్రకారం, గత 11 నెలల నిరసనలో మరణించిన 600 మంది రైతుల్లో 460 మంది డేటా ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. అధ్యయనం చేస్తున్నప్పుడు మరణించిన వారి కుటుంబాలను వ్యక్తిగతంగా సంప్రదించామని పేర్కొన్నారు. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారు చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని రైతులు (కౌలు రైతులు) అని అధ్యయనం సూచిస్తుంది. ఇది పంజాబ్లో ప్రాంతాల వారీగా రైతులు పాల్గొనడం, మరణాలు కూడా అలానే సంభవించాయి. మాల్వా ప్రాంతం నుంచి ఉద్యమంలో అత్యధికంగా పాల్గొనడంతో, అక్కడ అత్యధిక మరణాలు సంభవించాయి.
పంజాబ్లో ఉన్న 23 జిల్లాలను మూడు ప్రాంతాలుగా విభజిస్తే, మాల్వాలో 15 జిల్లాలు ఉండగా, దోబా, మజా ప్రాంతాల్లో ఒక్కొదానిలో నాలుగు జిల్లాలు ఉన్నాయి. అధ్యయనం ప్రకారం, మరణించిన వారిలో 80 శాతం మంది రైతులు పంజాబ్లోని మాల్వా ప్రాంతానికి చెందినవారు. వారు సాగు విస్తీర్ణంలో సాపేక్షంగా ఎక్కువ సగటు పరిమాణాన్ని కలిగి ఉన్నారు. తరువాత దోబా, మజా ఉన్నాయి. దోబా, మజా ప్రాంతంలో వ్యవసాయ నిరసన మరణాల వాటా వరుసగా 12.83 శాతం, 7.39 శాతంగా చెప్పొచ్చు.
తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రభావం
అధ్యయనం ప్రకారం, ఈ నెల 26 నాటికి రైతు ఉద్యమం ఏడాది పూర్తి చేసుకుంటున్నది. రైతు ఉద్యమంలో అత్యధిక సంఖ్యలో మరణాలకు వాతావరణ పరిస్థితులు దోహదపడ్డాయి. గత ఏడాది చివరిలో ఉద్యమం ప్రారంభించినప్పుడు నిరసనకారులు తీవ్రమైన చలిని తట్టుకోవలసి వచ్చింది. తరువాత, వేసవిలో మండే వేడిగాలులు ఢిల్లీ సరిహద్దుల్లో తాత్కాలిక గూడారాల్లో నివసిస్తున్న రైతులకు భరించలేనివిగా ఉన్నాయని అధ్యయనం తెలిపింది.
సాధారణ వంటశాలల్లో తయారు చేసిన ఆహారం రైతులకు సరైన స్థాయిలో రోగ నిరోధక శక్తిని నిర్వహించడానికి సహాయపడే పోషక అవసరాలను తీర్చకపోవచ్చు. ఇది వారిని వ్యాధుల నుంచి రక్షించలేదని అధ్యయనం తెలిపింది. ''భారీ వర్షాలు, మండే వేడి గాలులు, తీవ్రమైన చలిగాలులు వంటి సహజ వాతావరణానికి ఎక్కువ కాలం ఉండటంతో నిరసన సమయంలో రైతుల శరీరంపై చాలా ప్రభావం చూపడం సహజమే'' అని అధ్యయనం తెలిపింది.
రైతు మరణాలు మరింత పెరగొచ్చు
రెండో సంవత్సరంలోకి రైతు ఉద్యమం ప్రవేశించడంతో సహజ పర్యావరణానికి తీవ్ర ప్రభావానికి కారణమవుతుంది. దీంతో రైతుల్లో మరణాల రేటు మరింత పెరగవచ్చని అధ్యయనం పేర్కొంది. రైతుల మరణాలను పెంచే ఇతర కారణాల్లో రోడ్డు ప్రమాదాలు, పోలీసు చర్యలు కూడా ఉన్నాయి. ఇటీవల టిక్రీ సరిహద్దు సమీపంలో ముగ్గురు మహిళా రైతులు ట్రక్కు ఢకొీట్టడంతో మరణించారు.
మరణించిన రైతుల్లో ఎక్కువ మంది అప్పుల ఊబిలో ఉన్నవారే
రైతు ఉద్యమంలో మరణించిన రైతుల సగటు వయస్సు దాదాపు 57 ఏండ్లు. ఉద్యమంలో మరణించిన వారు వ్యవసాయ సమాజంలో అట్టడుగు స్థాయికి చెందినవారని కూడా అధ్యయనం వెల్లడించింది. అంటే ఆందోళనల్లో మరణించిన రైతులు నిరుపేద కుటుంబాలను చెందిన వారే. వీరిలో చాలా మందికి అప్పులు ఉన్నాయి. అధ్యయనం ప్రకారం, మరణించిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. ఎన్జీఓలు (సామాజిక సంస్థలు) కాకుండా, పంజాబ్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, మరణించిన రైతు కుటుంబ సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. కానీ ఈ మద్దతు చాలా వరకు సరిపోదని అధ్యయనం తెలిపింది. అయితే, మొత్తం మీద పంజాబ్ ప్రభుత్వం, ఎన్జీఓ సంస్థలు మరణించిన రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి తీసుకున్న చర్యలు రైతు రైతు ఉద్యమంపై సానుకూల ప్రభావాన్ని చూపాయని అధ్యయనం తెలిపింది.
ఆర్థిక సంస్కరణలకు ప్రత్యామ్నాయ ఎజెండా
జాతీయ స్థాయిలో సాధారణ ప్రజానీకాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిర్భయంగా అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఈ ఉద్యమం చోటు కల్పించింది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన పౌరుల హక్కులను పరిరక్షించడానికి, న్యాయ వ్యవస్థ వంటి సంస్థలకు ఇది మద్దతునిచ్చిందని అధ్యయనం తెలిపింది.
వాస్తవానికి, ఈ నిరసన ఉద్యమం గత 30 ఏండ్ల ఆర్థిక సంస్కరణల అమలుకు ప్రత్యామ్నాయ ఎజెండాను ముందుకు తెచ్చింది. దేశంలోని విభిన్న రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని వ్యక్తపర్చేవిధంగా చేసిందని అధ్యయనం తెలిపింది. ''రైతుల నిరసన ఉద్యమం అన్ని రాజకీయ పార్టీలను దూరంగా ఉంచింది. బహిరంగ వేదికను పంచుకోవడానికి వారిని అనుమతించలేదు. అందువల్ల, ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల నిరసన ఉద్యమం, విధాన రూపకల్పన నమూనాలో మార్పుకు సంబంధించి ప్రత్యామ్నాయ ఆలోచనను రూపొందించడంలో విజయవంతమైందని అధ్యయనం పేర్కొంది. అదే సమయంలో నియంత్రణ సడలింపు, మార్కెట్ సరళీకరణ, నిర్ణయాధికారంలో వాటాదారుల భాగస్వామ్యం వంటి లోపాలను ఎత్తిచూపిందని తెలిపింది. అయితే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ ఇప్పటికీ అలాగే ఉందని అధ్యయంలో ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు.