Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితుల్లో 17మంది చిన్నారులు,ఓ గర్భిణి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జికావైరస్ పంజా విసురుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదివరకే పలు కేసులు నమోదుకాగా, వాటిలో ఒక్క కాన్పూర్ జిల్లాలోనే మొత్తం 89 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల్లో 17 మంది చిన్నారులు, ఓ గర్భిణి కూడా ఉన్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. ''కాగా, రాష్ట్రంలో జికా వైరస్ కేసులు పెరుగుదల, వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఆరోగ్యశాఖ దీని నివారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది'' అని కాన్పూర్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నేపాల్ సింగ్ చెప్పారు. ఇప్పటివరకు నమోదైన జికా వైరస్ కేసుల్లో చిన్నారులతో పాటు ఓ గర్భిణి ఉన్నారనీ, వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు. జిల్లాలో వైరస్ వ్యాప్తికి కారణమయ్యే దోమల నివారణ చర్యలను ప్రభుత్వం చేపడుతున్నదని తెలిపారు. కాగా, జికా వైరస్‌ను ప్రధానంగా ఏడెస్ దోమలు వ్యాపింపజేస్తాయి. ఈ దోమలు పగటిపూట మాత్రమే కుట్టుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇన్ఫెక్షన్ సోకితే జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి (ఆరోగ్యం) అమిత్ మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ.. రోగులతో దగ్గరి పరిచయమున్న వారిని పెద్ద సంఖ్యలో పరీక్షిస్తున్నందున ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. జికా వైరస్ బాధితుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను సైతం ఏర్పాటు చేశామనీ, ప్రతిరోజు పాజిటివ్ పరీక్షింపబడిన వారితో మాట్లాడుతున్నామని తెలిపారు.