Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిటీ వేయాలని మహారాష్ట్ర సర్కార్‌కు బాంబే హైకోర్టు ఆదేశం
దాదర్: మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ ఆర్టీసీ )కార్పొరేషన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగుల సంఘాలు సమ్మె చేస్తున్నాయి. ఉద్యోగుల సమ్మె కారణంగా సోమవారం ఉదయం ఎంఎస్ఆర్టీసీకి చెందిన 223 డిపోల్లో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో వారి డిమాండ్లను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు సోమవారం ఆదేశించింది. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు సోమవారం సాయంత్రంలోగా ప్రభుత్వ తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.సమ్మెను మానుకోవాలని కార్పొరేషన్‌లోని ఉద్యోగులను కోర్టు గత వారం ఆదేశించింది . అయితే కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా సమ్మె చేయడంపై కార్మికుల యూనియన్‌పై అసహనం వ్యక్తం చేసింది.సమ్మెకు వ్యతిరేకంగా ఎంఎస్ఆర్టీసీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌లు ఎస్‌జె కథవాలా, ఎస్పీ తావ్డేలతో కూడిన వెకేషన్ బెంచ్, గత ఉత్తర్వుల్లో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించినప్పటికీ, ఇప్పుడు మరిన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఆర్టీసీ ఉద్యోగులను సానుభూతితో పరిగణించవచ్చని బెంచ్ అభిప్రాయపడింది. కాగా ఎంఎస్ఆర్టీసీలోని ఒక విభాగం ఉద్యోగులు అక్టోబర్ 28 నుంచి విధులకు గైర్హాజరవుతున్నారు. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన కార్పొరేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్దీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.