Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్సల్ సోదరులకు ఏడేండ్ల జైలు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో 24ఏండ్ల క్రితం జరిగిన ఉపహార్ సినిమా థియేటర్ అగ్నిప్రమాదం కేసులో దోషులకు సోమవారం జైలు శిక్ష ఖరారైంది. వ్యాపారవేత్తలు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్ సమా పలువురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించింది. సుశీల్, గోపాల్‌కు చెరో రూ.2.25 కోట్ల చొప్పున జరిమానా విధించింది. ఉపహార్ ఘటనలో ఈ సోదరులిద్దరూ సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలో వాదనలు విన్న కోర్టు నెల క్రితమే వారిని దోషులుగా తేల్చింది. సోమవారం శిక్ష ఖరారుచేసింది. 13 జులై 1997న ఢిల్లీలో గ్రీన్‌పార్క్ ప్రాంతంలోని ఉపహార్ థియేటర్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. థియేటర్లో 'బోర్డర్' సినిమా ప్రదర్శన జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 59మంది మరణించగా..అగ్నిప్రమాదం తొక్కిసలాట కారణంగా 100మందికిపైగా గాయపడ్డారు. ఢిల్లీ చరిత్రలో ఇదే అతిపెద్ద అగ్నిప్రమాద ఘటనగా చెబుతారు. ఈ ఘటనలో థియేటర్ యజమానులు అన్సల్ సోదరులు సుశీల్, గోపాల్‌పై కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం సర్వోన్నత న్యాయస్థానం వారికి రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత వారు జైలు నుంచి విడుదల కావడంతోపాటు చెరో రూ.30కోట్ల జరిమానా చెల్లించారు. కాగా.. ఆ మొత్తాన్ని ఢిల్లీలోని ట్రామా కేర్ సెంటర్ నిర్మాణానికి కేటాయించారు.