Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత ఐదేండ్లలో ఎన్నడూలేనంతగా..
- దేశంలో అక్టోబర్ నెలలో అత్యధిక డిమాండ్..
- గుజరాత్లో ఎక్కువ షార్టేజీ
న్యూఢిల్లీ : దేశంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ కొరత అక్టోబర్ నెలలో చోటు చేసుకుంది. గత ఐదేండ్లలో ఎప్పుడూ అక్టోబర్‌లో ఇలాంటి పరిస్థితి నెలకొనలేదు. థర్మల్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు కుప్పకూలాయి. ఫలితంగా అక్టోబర్‌లో దేశంలో 1,201 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా కొరత నమోదైంది. ఇది ఐదున్నరేండ్లలో అత్యధికంగా ఉందని చెప్పొచ్చు. థర్మల్ ప్లాంట్లతో అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వల కొరత కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. గుజరాత్, హర్యానా, జార్ఖండ్, పంజాబ్, రాజస్థాన్‌ల్లో విద్యుత్ కొరత ఎక్కువగా నమోదైంది. అక్టోబరులో గుజరాత్లో 214.71 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతఉన్నట్టు గుర్తించారు. ఇది దశాబ్దానికి పైగా ఏ నెలలో లేని విధంగా అత్యధిక కొరతగా నమోదైంది. 77 మిలియన్ యూనిట్ల కొరతతో జార్ఖండ్ కూడా దశాబ్దానికి పైగా అత్యధిక లోటును నమోదు చేసింది.
థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా లేకనే...
ప్రధానంగా 135 థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా లేకపోవడంతో విద్యుత్ కొరత ఏర్పడింది. నవంబర్ 5 నాటికి ప్లాంట్ల వద్ద ఉన్న సగటు బొగ్గు నిల్వ ఏడు రోజులు మాత్రమే ఉంటుంది. సరాసరి స్టాక్ పొజిషన్ అక్టోబరు మధ్యలో నాలుగు రోజుల కంటే తక్కువ సరఫరాకు పడిపోయింది. అయితే సగటున అవసరమైన సాధారణ స్టాక్ 21 రోజుల కంటే ఎక్కువ ఉండాలి. జూన్ మధ్యలో చివరిసారి సగటు స్టాక్ అవసరాల స్థాయికి సమీపంలో ఉంది. అప్పటి నుంచి అది వేగంగా క్షీణించింది. నవంబర్ 5 నాటికి దాదాపు 32 ప్లాంట్లలో నాలుగు రోజుల కంటే తక్కువ బొగ్గు నిల్వలు ఉన్నాయి. 65 ప్లాంట్లు నాలుగు నుంచి తొమ్మిది రోజుల వరకు స్టాక్‌ను కలిగి ఉన్నాయి. దాదాపు 35 ప్లాంట్లు 10 నుంచి 19 రోజుల వరకు నిల్వ ఉన్నాయి. నవంబర్ 5 నాటికి మొత్తం 135 ప్లాంట్ల ఇన్వెంటరీలలో కేవలం 1.45 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే దిగుమతి అయింది. ఫిబ్రవరి 2020లో స్టాక్‌లో అందుబాటులో ఉన్న 15.43 లక్షల టన్నుల దిగుమతి చేసుకున్న బొగ్గుకు, ఇది చాలా తక్కువగా ఉంది. అంతర్జాతీయ బొగ్గు ధర గణనీయంగా పెరగడం దిగుమతుల్లో తగ్గుదలకు దారితీసింది.
అధిక ధరలు
కోల్ ఇండియా లిమిటెడ్ 47వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఉద్దేశించి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ఇటీవల అంతర్జాతీయ బొగ్గు ధర మూడు రెట్లు పెరిగిందని, దీని ఫలితంగా దిగుమతులు 38 శాతం తగ్గాయని పేర్కొన్నారు. అదే సమయంలో విద్యుత్ డిమాండ్ 24 శాతం పైగా పెరిగిందని మంత్రి తెలిపారు. ''ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి థర్మల్ ప్లాంట్లలో కనీసం 18 రోజుల బొగ్గు నిల్వ ఉండేలా అన్ని విధాలా కృషి చేయాలని'' కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు.
రాష్ట్రాల వారీగా విద్యుత్ కొరత
గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 200 మిలియన్ యూనిట్లకు పైబడి విద్యుత్ కొరత నమోదైది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో 75 నుంచి 200 మిలియన్ల యూనిట్లు విద్యుత్ కొరత ఏర్పడింది. కర్నాటక, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, కేరళ, గోవా, ఛత్తీస్గడ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయా, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో 1 నుంచి 20 మిలియన్ యూనిట్ల కొరత ఏరడింది. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యుత్ కొరత సంభవించలేదు.