Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర, బీహార్, గుజరాత్‌లలో అధికం..
- తీవ్రమైన కేటగిరిలో సగానికి పైగా చిన్నారులు
- కేంద్ర మహిళా, శిశుఅభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో 33 లక్షల మందికి పైగా చిన్నారులు పోషకాహారలో లోపంతో బాధపడుతున్నారనీ, వీరిలో సగం కంటే ఎక్కువ మంది చిన్నారులు తీవ్రమైన పోషకాహార లోపంతో ఆందోళనకర స్థితిలో ఉన్నారని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో అత్యధికంగా మహారాష్ట్ర, బీహార్, గుజరాత్‌లలో ఉన్నారు. సమాచారం హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సంబంధిత మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. కరోనా మహమ్మారి పేదవారిలో ఆరోగ్య, పోషకాహార సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 14 నాటికి 17,76,902 మంది చిన్నారులు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మరో 15,46,420 మంది పిల్లలు మధ్యస్థ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ సమాచారం మొత్తం 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినదనీ, మొత్తం 33,23,322 మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు అధికంగా మహారాష్ట్రలో 6,16,772 మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న బీహార్‌లో 4,75,824 మంది, గుజరాత్లో 3,20,465 మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వీటి తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ (2,67,228), కర్నాటక (2,49,463), ఉత్తరప్రదేశ్ (1,86,640)లు ఉన్నాయి. 2020 నవంబర్-2021 అక్టోబర్ 14 మధ్య కాలంలో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల్లో 91 శాతం పెరుగుదల నమోదైంది. గతేడాది నవంబర్‌లో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య 9,27,606గా ఉంది. అయితే, ఈ రెండు డేటాల సేకరణలో విభిన్న తేడాలు ఉన్నాయి. గతేడాది ఇలాంటి గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించి కేంద్రానికి అందజేయగా.. ఈ ఏడాది గణాంకాలను అంగన్వాడీ కార్యకర్తలు నేరుగా పోషణ్ ట్రాకర్ యాప్‌లో నమోదు చేసిన డేటాను కేంద్రం పరిగణలోకి తీసుకుంది. అలాగే, గత సంవత్సరం డేటాలో పిల్లల వయస్సును ఆరు నెలల నుంచి ఆరేండ్లుగా పేర్కొనగా, ఈ ఏడాది వారి వయస్సు వివరాలను పేర్కొనలేదు. పోషణ్ ట్రాకర్ యాప్‌ను అన్ని అంగన్వాడీ కేంద్రాలు యాక్సెస్ చేసే విధంగా.. అందులో లబ్దిదారుల వివరాలను నమోదు, ట్రాక్ చేయడానికి దీనిని కేంద్ర మహిళా,శిశుఅభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఇదిలావుండగా, ఇటీవల విడుదల చేసిన 2021-గ్లోబల్ హంగర్ ఇండెక్స్116 దేశాల జాబితాలో భారత్ 101 స్థానంలో నిలిచింది. ఇంతకు ముందు 94 ర్యాంకు ఉంది. అయితే, పొరుగు దేశాలైన పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లు భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉండటం దేశంలో ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. ప్రస్తుత పరిస్థితులను అంగీకరించని సర్కారు.. ఈ సూచిక కోసం ఉపయోగించిన పద్దతి అశాస్త్రీయంగా ఉందని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.