Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : కృష్ణా జలాల పంపకానికి సంబంధించి కర్నాటక ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ (ఐఏ)పై కౌంటరు దాఖలుచేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆలమట్టి డ్యాం ఎత్తు 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచడానికి అనుమతిస్తూ కృష్ణా ట్రిబ్యునల్-2 అవార్డు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ 2014లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌కు సంబంధించి... జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డును కేంద్రం అమలు చేయాలంటూ కర్నాటక ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. కర్నాటక ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్వాదనలు వినిపిస్తూ.. అవార్డు నోటిఫై చేయకపోవడం వల్ల రాష్ట్ర వాటా జలాలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయన్నారు. జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు మేరకు రాష్ట్రంలో రూ.13వేల కోట్లతో కాలువలు తవ్వించామన్నారు. ట్రిబ్యునల్ అవార్డు అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని ధర్మాసనాన్ని శ్యాందివాన్ కోరారు. ఏపీ తరపున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను వివరించారు. కర్నాటక దాఖలు చేసిన ఐఏకు తదుపరి విచారణలోపు కౌంటరు దాఖలు చేయాలనీ, మహారాష్ట్ర దాఖలుచేసిన ఐఏను జత చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 29కు వాయిదా వేసింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్, మహారాష్ట్ర తరపు సీనియర్ న్యాయవాది నార్‌గోల్కర్, కేంద్రం తరపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలు హాజరయ్యారు.