Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీలో విద్యార్థులపై లాఠీ
- 'అనంత' ఎస్ఎస్బిఎన్ ప్రాంగణంలో పోలీసుల దాష్టీకం
- విద్యార్థినికి తీవ్ర గాయం
- పోలీసు చర్యపై విపక్షాల ఆగ్రహం
అనంతపురం : అనంతపురం నగరంలోని ఎస్ఎస్బిఎన్ విద్యా సంస్థను ఎయిడెడ్‌గానే కొనసాగించాలని కోరినందుకు విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. కళాశాల క్యాంపస్‌లోకి చొరబడి దాష్టికానికి పాల్పడ్డారు. విద్యార్థి నాయకులను చొక్కాలు పట్టుకొని లాక్కెళ్లి పోలీసుల జీపుల్లో పడేశారు. ఈ సంఘటనతో అనంతపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహ రించిన తీరును ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఎస్ఎస్బిఎన్ విద్యా సంస్థలో హైస్కూల్ నుంచి డిగ్రీ వరకూ విద్యను అందిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో ప్రైవేటు సంస్థగా మారాలని ఎస్ఎస్బిఎన్ యాజమాన్యం నిర్ణయిం చింది. దీనిలో భాగంగా విద్యార్థులకు టీసిలు ఇవ్వడాన్ని ప్రారంభించింది. అయితే, దీనిని విద్యా ర్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంటర్మీడియట్‌కు ప్రస్తుతం సంవత్సరానికి 2 వేల రూపాయలు ఫీజు కడుతుంటే ఇకనుండి 12 వేల రూపాయలు కట్టాలని యాజమాన్యం చెబుతోందని, అంత భారీ ఫీజులు కట్టలేమని సంస్థను ఎయిడెడ్లోనేకొనసాగించాలని వారు కోరుతున్నారు. ఇదే డిమాండ్‌తో ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం విద్యాసంస్థ ప్రాంగణంలోనే ఆందోళనకు దిగారు. అన్ని తరగతుల విద్యార్ధులు ఈ ఆందోళనలో భాగస్వాములయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనపై విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా విద్యాసంస్థ ప్రాంగణంలోకి దూసుకువచ్చిన పోలీసులు విద్యార్థుల కాలరు పట్టుకుని, ముష్టిఘాతాలు కురిపించారు. బలవంతంగా లాక్కొంటూ తీసుకెళ్లి పోలీసు జీపుల్లో కుక్కారు. కనబడిన విద్యార్థినల్లా అరెస్టు చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధపడగా విద్యార్థులంతా అడ్డుకున్నారు. దీంతో, పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సమయంలో కళాశాలకు చెందిన హేమ అనే విద్యార్థిని తలకు బలమైన గాయమైంది. వెంటనే ఇతర విద్యార్థులు ఆమె తలకు చున్నీచుట్టి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు అడ్డుకుని తమ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఆ విద్యార్థిని తలకు నాలుగు కుట్లు పడ్డాయి. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర, ఎఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు మనోహర్‌తోపాటు మరో ముగ్గురు విద్యార్థులను పోలీసులు వాహనంలో బలవంతంగా ఎక్కించి త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై డిఎస్పి వీరరాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై మీడియా ప్రతినిధులు నిరసన తెలిపారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు సాయంత్రం విడుదల చేశారు.
చర్యలు తీసుకోవాలి : సీపీఐ(ఎం)
విద్యార్థులపై లాఠీఛార్జి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విద్యార్థులపై అమానుషంగా లాఠీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకపక్క ఎయిడెడ్ కాలేజీలను కొనసాగిస్తామని ప్రభుత్వం చెబుతూనే, మరోవైపు ఇందుకోసం పోరాడుతున్న విద్యార్థుల తలలు పగలకొట్టడం ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎయిడెడ్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్దఎత్తున పాల్గొంటున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందనా లేదని, తక్షణమే ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని, అవసరమైన నిధులు, టీచింగ్ స్టాఫ్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పట్ల పోలీసుల తీరును సీపీఐ(ఎం) అనంతపురం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ఖండించారు.
పైశాచికత్వానికి పరాకాష్ట : చంద్రబాబు
విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం పట్ల ట్విట్టర్ వేదికగా చంద్రబాబు స్పందించారు. వైసిపి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహస్తోన్న పోలీసులు విద్యార్థుల రక్తం కళ్లజూడడం పైశాచికత్వానికి పరాకాష్టని పేర్కొన్నారు. కళాశాలను రక్షించుకోవాలని తాపత్రయ పడడమే సరస్వతీ పుత్రులు చేసిన పాపమా? అని ట్వీట్ చేశారు.