Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూర్ ఖేరీ మారణకాండపై సుప్రీంకోర్టు
- మేం ఆశించిన విధంగా విచారణ జరగడంలేదని వ్యాఖ్య
- యూపీ పోలీసుల దర్యాప్తుపై అసంతృప్తి
- రెండు ఎఫ్ఐఆర్లను కలపడం వల్ల నిందితుడికి ప్రయోజనం
- వేర్వేరుగా దర్యాప్తు చేయండి
- స్టేటస్ రిపోర్టులో ఏమీ లేదు : జస్టిస్ ఎన్వి రమణ
న్యూఢిల్లీ : అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో రైతుల మారణకాండ ఘటనకు సంబంధించి యూపీ పోలీసుల దర్యాప్తుపై అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ ఘటనపై తాము ఆశించిన విధంగా విచారణ జరగడం లేదనీ, కనుక ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధంలేని (ఇతర రాష్ట్రాల హైకోర్టు) రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిని విచారణ పర్యవేక్షణకు నియమిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. అందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్ జైన్, జస్టిస్ రంజిత్ సింగ్ పేర్లను ధర్మాసనం సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. వీడియో ఆధారాలకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు ఇంకా రాకపోవడం, నిందితులందరి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతులపై దాడికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిపై కేసు దర్యా ప్తును.. మూక దాడి (మాబ్ లిన్చింగ్) కౌంటర్ కేసుతో జత చేయడంవల్ల రైతులపై దాడి కేసును పలుచన చేయడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తంచేసింది. రెండు కేసుల దర్యాప్తు వేర్వేరుగా ఉండాలనీ, రెండు కేసుల్లోని సాక్షుల వాంగ్మూలాలను స్వతంత్రంగా నమోదు చేయాలని ధర్మాసనం సూచించింది. రెండు కేసుల సాక్ష్యాలు కలిసిపోకుండా ఉండేలా దర్యాప్తును పర్యవేక్షించేందుకు మరో రాష్ట్ర హైకోర్టు (ఉత్తరప్రదేశ్ హైకోర్టుకు సంబంధం లేని) రిటైర్డ్ న్యాయమూర్తిని నియమిస్తామని ధర్మాసనం పేర్కొంది. ''ఇది దర్యాప్తులో న్యాయాన్ని, నిష్పాక్షికతను ప్రేరేపించడానికి'' అని జస్టిస్ సూర్య కాంత్ పేర్కొన్నారు. ''సరైన విచారణ జరిగేలా చూడటానికి మేం ఇక్కడ ఉన్నాం'' అని సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే స్పందిస్తూ ధర్మాసనం చేసిన సూచనలపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 12 (శుక్రవారం) నాటికి వాయిదా వేసింది.
మేం ఆశించిన విధంగా జరగటంలేదు : జస్టిస్ ఎన్వి రమణ
''స్టేటస్ రిపోర్టు చూశాం. స్టేటస్ రిపోర్టులో ఏమీ లేదు. చివరి విచారణ తేదీ తరువాత, మేం పది రోజుల వాయిదా గడువు ఇచ్చాం. ల్యాబ్ నివేదికలు రాలేదు. ఇది మేం ఆశించిన విధంగా జరగటం లేదు'' అని సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. నవంబర్ 15 నాటికి ల్యాబ్ రిపోర్టులు సిద్ధమవుతాయని యూపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే పేర్కొన్నారు. ఇతర సమస్యల పరిస్థితి ఏంటని సీజేఐ ప్రశ్నించారు. ''ఒక నిందితుడి ఫోన్ మాత్రమే సీజ్ చేశారు. ఇతరుల పరిస్థితి ఏంటీ? మీరు స్వాధీనం చేసుకోలేదా? ఒక నిందితుడి వద్ద మాత్రమే మొబైల్ ఫోన్ ఉందా?'' అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. దీనికి ''కొంత మంది నిందితులు తమ వద్ద ఫోన్లు లేవని చెప్పారు. అయితే కాల్ డేటా రికార్డు (సీడీఆర్)లు లభించాయి'' అని హరీశ్ సాల్వే బదులిచ్చారు. నిందితులు తమ ఫోన్లను పారేశారనీ, అయితే వారి సీడీఆర్ల నుంచి వారి లొకేషన్లను గుర్తించామని సాల్వే తెలిపారు. ''నిందితులు తమ ఫోన్లను పారేశారనీ, వారి సీడీఆర్లను గుర్తించినట్టు మీరు స్టేటస్ రిపోర్టులో ఎక్కడ పేర్కొన్నారు?'' అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు.
రెండు ఎఫ్ఐఆర్లను కలపడం వల్ల నిందితుడికి ప్రయోజనం
నిరసన చేస్తున్న రైతులపై దాడికి సంబంధించిన ఎఫ్ఐఆర్, ఫలితంగా జరిగిన మూక దాడికి సంబంధించిన కౌంటర్ ఎఫ్ఐఆర్ ఈ రెండింటిని కలపడం ద్వారా ఒక నిర్దిష్ట నిందితుడికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం ఏమైనా ఉందా? అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ''రెండు ఎఫ్ఐఆర్లను కలపడం ద్వారా ఒక నిర్దిష్ట నిందితుడు ప్రయోజనం పొందాలని చూస్తున్నట్టు ప్రాథమికంగా కనిపిస్తోంది. ఇప్పుడు రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెబుతున్నారు. ఒక ఎఫ్ఐఆర్లో సేకరించిన సాక్ష్యాలను మరొక ఎఫ్ఐఆర్లో ఉపయోగిస్తారు. ఎఫ్ఐఆర్ 220లోని సాక్ష్యాలను ఒక నిందితుడిని రక్షించే విధంగా సేకరిస్తున్నారు'' అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.ఎఫ్ఐఆర్ 219 రైతులపై దాడికి సంబంధించినంది. ఎఫ్ఐఆర్ 220 మూకదాకి సంబంధించినది.ఈ రెండు కేసులను విడివిడిగా విచారించి ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా జాగ్రత ్తలు తీసుకుంటున్నట్లు హరీశ్ సాల్వే తెలిపారు. ఒక కేసులో ముందుకు వచ్చిన కొందరు సాక్షులు మరో కేసుకు సంబంధించిన వివరణాత్మక వాంగ్మూలాలు ఇవ్వడం ప్రారంభించారని సాల్వే అన్నారు. స్టేటస్ రిపోర్టులో పేరా 12లో 68 మంది సాక్షుల వాంగ్మూలాలను సూచిస్తున్నారు. వారిలో ఏవి తొలగించారో మాకు తెలియదని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. దీనికి సాల్వే బదులిస్తూ ''మీ ఆందోళన సరైనదే. కొందరు అవాస్తవ సాక్ష్యాలు ఇచ్చారు'' అని అన్నారు. ''హత్యలో ఒకటి రైతులది, మరొకటి రాజకీయ కార్యకర్తలది. అన్నింటినీ తార్కిక ముగింపుకు తీసుకెళ్లాలి. ఆరోపించిన రాజకీయ కార్యకర్త విషయంలో నిందితులు మరణించారని చెబుతున్నారు. అది అక్కడ ఉంది. మరో విషయం ఏమిటంటే రైతులను దారుణంగా చంపిన నిందితులు ఎవరో కనుగొనడానికి మీరు ప్రయత్నించాలి''అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.రైతుల హత్య కేసులో వాంగ్మూ లాలు ఇవ్వడానికి వచ్చే సాక్షులు(ఎఫ్ఐఆర్ 219)వారి స్టేట్మెంట్లు, ఇతర రైతుల వాంగ్మూలాలు స్వతంత్రంగా ఉంచాలని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
కారు ఢ కొనటంవల్లే జర్నలిస్టు మృతి
కారు ఢకొీనటంవల్లే జర్నలిస్టు రమణ్ కశ్యప్ మరణించినట్టు ధర్మాసనం పరిశీలించిందని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. అందుకు యూపీ ప్రభుత్వ న్యాయవాది హరీశ్ సాల్వే స్పందిస్తూ.. అవును జర్నలిస్టు హత్య మూకదాడి వల్ల జరగలేదని పేర్కొన్నారు. ''జర్నలిస్టు హత్య మూకదాడి కారణంగానే జరిగిందని మొదట భావించినప్పటికీ, అతను కారు కింద నలిగిపోయినట్టు తేలింది'' అని సాల్వే తెలిపారు.