Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాఫెల్ కుంభకోణంలో మీడియాపార్ట్ తాజా నివేదిక వెల్లడి
- రుజువులున్నా దర్యాప్తునకు సిద్ధపడని కేంద్ర దర్యాప్తుసంస్థలు
న్యూఢిల్లీ : భారత్‌కు 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కుంభకోణంలో 'బూటకపు ఇన్వాయిస్ల' సెట్‌ను ఫ్రెంచి వెబ్సైట్ 'మీడియాపార్ట్' సోమవారం ప్రచురించింది. 2007-2012 మధ్య కాలంలో, అత్యంత ప్రభావితం చేయగలిగిన రక్షణ దళారీ సుషేన్ గుప్తాకు ఫ్రెంచ్ వైమానిక సంస్థ దసాల్ట్ ఏవియేషన్ రూ. 65 కోట్లు ( దాదాపు 7.5 మిలియన్ యూరోలు) ముడుపులు చెల్లించేందుకు ఈ ఇన్వాయిస్లను ఉపయోగించారని పేర్కొంది. ప్రస్తుతం గుప్తా , ఈ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరుపుతున్న మనీలాండరింగ్ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో మీడియాపార్ట్ ప్రచురించిన నివేదికలు, గత 15ఏండ్లుగా దసాల్ట్, థేల్స్లతో గుప్తాకు గల వాణిజ్య సంబంధాలను బట్టబయలు చేశాయి. సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ కోసం రూపొందించిన ఇన్వాయిస్లను ఉపయోగించి విదేశాల్లోని ఖాతాలకు, బూటకపు కంపెనీలకు రహస్య ముడుపులుగా అనేక లక్షల యూరోలను చెల్లించారని ఈ నివేదికలు పేర్కొన్నాయి. గుప్తాకు రహస్య ముడుపులుగా 2007 నుంచి 2012 మధ్య దాదాపు రూ. 65 కోట్ల ( కనీసం 7. 5 మిలియన్ యూరోలు ) దసాల్ట్ చెల్లించిందనీ, అందుకు సీబీఐ వద్ద రుజువులూ వున్నాయని ఫ్రెంచి ఆన్లైన్ జర్నల్ పేర్కొన్నది. మారిషస్ షెల్ కంపెనీ ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్ ద్వారా అగస్టావెస్ట్‌ల్యాండ్ నుంచి ముడుపులు పొందాడన్న విషయంలో గుప్తా నిందితుడిగా ఉన్నాడు. కాగా, రాఫెల్ డీల్ విషయంలో అధికంగా బిల్లులు చూపి మరీ చెల్లించారు. బూటకపు ఇన్వాయిస్లు ఉపయోగించి మారిషస్‌కు అత్యంత తెలివిగా డబ్బు పంపారు. ఈ ఇన్వాయిస్ల్లో కొన్నింటిపై దసాల్ట్ ఏవియేషన్‌కు బదులుగా తప్పుగా ఫ్రెంచి కంపెనీ పేరును చూపించారని నివేదిక పేర్కొంది. దసాల్ట్ గెలిచిన తొలినాటి ఎంఎంఆర్సీఏ టెండర్లో భాగంగానే 2007 నుంచి 2012 మధ్య కాలంలో ఈ బిడ్డింగ్ క్రమం చోటుచేసుకుంది.
2018 అక్టోబరు 11న మారిషస్‌లోని అటార్నీ జనరల్ కార్యాలయం నుంచి సీబీఐకి అగస్టావెస్ట్ ల్యాండ్ ముడుపులకు సంబంధించిన కొన్ని పత్రాలు అందాయని మీడియాపార్ట్ తెలిపింది.రాఫెల్ ఒప్పందానికి సంబంధించి అవినీతి జరిగిందంటూ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, బీజేపీ మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరిల నుంచి అధికారికంగా ఫిర్యాదు అందిన వారం రోజులకే ఆ పత్రాలు అందాయి. ''ఈ కేసుకు సంబంధించి అవినీతి ఫిర్యాదు, మారిషస్ నుంచి సమాచారం అందిందని వాస్తవం. అయినప్పటికీ, మొత్తం కొనుగోలు క్రమంపై అనుమానాలు పేరుకుపోవడం దర్యాప్తునకు దారి తీసింది. రాజకీయ కారణాల రీత్యా ఈ కేసును తొలగించారా?'' అంటూ దీనిపై మీడియాపార్ట్ అడిగిన ప్రశ్నలకు అటు సీబీఐ కానీ, ఇటు ఈడీ కానీ స్పందించడం లేదని నివేదిక పేర్కొంది.
మధ్యవర్తికి ఇచ్చిన ముడుపులపై దర్యాప్తునకు సీబీఐ తిరస్కృతి
ముడుపులిచ్చినట్టుగా పత్రాలు అందుబాటులో వున్నప్పటికీ దర్యాప్తు చేయడంలో భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు విఫలమయ్యాయని మీడియాపార్ట్ తాజాగా విడుదలైన నివేదికలో పేర్కొన్నది. రాఫెల్ జెట్ల అమ్మకం కోసం సుషేన్ గుప్తాకు దసాల్ట్ ముడుపులు చెల్లించినట్టు సీబీఐ, ఈడీల దగ్గర 2018 అక్టోబరు నుంచి సాక్ష్యాధారాలు వున్నాయనీ, అయినా దర్యాప్తు జరపకుండా సీబీఐ నిర్ణయించిందని నివేదిక ఆరోపించింది.