Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాణం తీసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆస్పత్రి
- హమీదియా హాస్పిటల్ కాంప్లెక్స్‌లో ఎగిసిపడ్డ మంటలు
భోపాల్ : భోపాల్‌లోని ప్రభుత్వ వైద్యశాల అయిన హమీదియా హాస్పిటల్ కాంప్లెక్స్‌లోని మూడో అంతస్తులో ఉన్న కమలా నెహ్రూ దవాఖానా(పిడియాడ్రిక్స్)లో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగినపుడు సుమారు యాభై మంది పిల్లలకు పైగా చికిత్స పొందుతున్నారు. అయితే ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో ఆస్పత్రి పరిస రాల్లో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. వార్డు లో ఉన్న కొందరు చిన్నారుల్ని అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసినా... ఏడుగురు చిన్నారులు సజీవ సమాధి అయినట్టు సమాచారం. మృతుల సంఖ్యను అధికారులు ప్రకటించాల్సి ఉన్నది. ఆస్పత్రిలో ఘోరం జరిగిందనే సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు విలపిస్తూ చేరుకున్నారు. వారిని లోనికి అనుమతించలేదు.
వార్డులో ఎంతమంది ఉన్నారు..?
ఆస్పత్రిలో మంటలు చెలరేగినప్పుడు భయంకరమైన పేలుడు సంభవించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొద్దిసేపు తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులతో పాటు డజనుకు పైగా స్టాఫ్ నర్సులు కూడా ప్రమాదం బారినపడినట్టు తెలిసింది. వార్డు సహా చుట్టూ పొగ వ్యాపించటంతో.. ఊపిరాడక చాలా మంది చిన్నారుల రోదనలు అరణ్యరోదనగా మారింది. బయటకు తెచ్చిన పిల్లల్ని కుటుంబీకులు సత్వరమే దగ్గర్లోని ప్రయివేట్ ఆస్పత్రుల్లో చేర్పించారు.
బీజేపీ సర్కార్ నిర్లక్ష్యమే..
ఆస్పత్రిలో ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఘోరం జరిగిందని ప్రాధమిక అంచనాకొచ్చారు.
హమీదియా ఆస్పత్రిలో ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయనీ, బాగు చేయాలని అక్కడి బీజేపీ సర్కారు దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. గతంలో ప్రమాదాలు జరిగాయని అధికారులు చెబుతున్నా..నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డల్ని కోల్పోయామని కుటుంబీకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ఆస్పత్రి ఆవరణలో భయానక వాతావరణం నెలకొంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శకటాలు, మున్సిపల్ అధికారులు, పోలీసు యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకున్నది.