Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరిహద్దులతో పాటు అన్ని రాష్ట్ర రాజధానుల్లో ఉమ్మడి సభలు
- ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భారీ సమీకరణ
- పార్లమెంట్‌కు ప్రతిరోజు ట్రాక్టర్లతో 500 మంది
- ఎస్కేఎం సమావేశం నిర్ణయం
న్యూఢిల్లీ : దేశంలో చారిత్రాత్మక రైతు ఉద్యమం ఈ నెల 26తో ఏడాది పూర్తి చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఆ రోజున భారీ సభలు నిర్వహించేందుకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నిర్ణయించింది. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భారీ సమీకరణ చేయాలని నిర్ణయించింది. అలాగే ప్రతిరోజూ 500 మంది రైతులు పార్లమెంట్‌కు ట్రాక్టర్లతో ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు సింఘూ సరిహద్దు వద్ద జరిగిన ఎస్కేఎం సమావేశం నిర్ణయం తీసుకున్నది. నవంబర్ 26న పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ల నుంచి ఢిల్లీ సరిహద్దులకు భారీ జనసమీకరణ జరగనుందని, అక్కడ భారీ సమావేశాలు నిర్వహించనున్నామని ఎస్కేఎం పేర్కొంది. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువకులు, విద్యార్థులు ఈ నెల 26న దేశంలోని అన్ని రాష్ట్ర రాజధానుల్లో భారీ ఉమ్మడి సభలు నిర్వహించాలని పిలుపు నిచ్చింది. నవంబర్ 29న ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయనీ, ఆ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు 500 మంది ఎంపిక చేసిన రైతులు ప్రతి రోజూ శాంతియుతంగా ట్రాక్టర్లపై పార్లమెంట్‌కు వెళ్లనున్నట్టు పేర్కొంది. మోడీ సర్కార్ మొండి వైఖరిపై ఒత్తిడి పెంచాలని ఎస్కేఎం నిర్ణయించింది. లఖింపూర్ ఖేరీ ఊచకోత కేసులో నిజానిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయనీ, అయినా మోడీ, యోగి ప్రభుత్వాలు సిగ్గులేకుండా మంత్రిని, ఆయన కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్కేఎం విమర్శించింది. కేంద్ర మంత్రి అజరు మిశ్రాను పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలనీ, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని ఎస్కేఎం పునరుద్ఘాటించింది. నార్నౌండ్లో నల్ల జెండాలతో ఆందోళన చేసిన రైతులపై బనాయించిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవడానికి, బీజేపీ ఎంపీ రామ్ చందర్ జంగ్రాపై కేసు నమోదు చేయడానికి హర్యానా ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో హన్సి జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన రెండో రోజు కూడా కొనసాగింది. ఈ కేసులో న్యాయం చేయాలంటూ వేలాది మంది రైతులు, రైతు నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. బీజేపీ ఎంపి రామ్‌చందర్ జంగ్రాపై కేసు నమోదు చేసేందుకు అధికార యంత్రాంగం నిరాకరించడంతో రైతు నేతలు, అధికార యంత్రాంగం మధ్య చర్చలు విఫలమయ్యాయి. కాగా, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రైతు కుల్దీప్ సింగ్ రాణా మృత్యువుతో పోరాడుతూనే ఉన్నాడు.