Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విడుదల అనుమానమే!
న్యూఢిల్లీ : పౌర హక్కుల నేత వరవరరావు రాసిన గేయాల్ని ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థ 'పెంగ్విన్' ఇప్పట్లో విడుదల చేసే పరిస్థితి లేదని సమాచారం. ఆయన రచించిన కవితలు, గేయాల్ని ఒక పుస్తకంగా విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన 'పెంగ్విన్', ఇప్పుడు తటపటాయిస్తోంది. 'పెంగ్విన్'కు చెందిన అధికారిక వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం, పుస్తకం విడుదల నిరవధికంగా నిలిచిపోయిందని తెలుస్తోంది. విప్లవ కవి, పౌర హక్కుల నేతగా వరవరరావుకు పౌర సమాజంలో ఎంతో గుర్తింపు ఉందన్న సంగతి తెలిసిందే. వరవరరావుపై మోడీ సర్కార్ 'ఉపా' చట్టం కింద పలు కేసుల్ని నమోదుచేసింది. ఈ కేసులో మెడికల్ బెయిల్ లభించగా, ప్రస్తుతం ఆయన ముంబయిలో ఉన్నారు.
వరవరరావు గత ఆరు దశాబ్దాలుగా అనేక గేయాల్ని, కవితలను రచించారు. వీటిలో 65 కవితలను ఎంచుకొని 'వరవరరావు : ద రివాల్యూషనరీ పోయెట్' పేరుతో పుస్తకాన్ని విడుదల చేయడానికి ప్రచురణ సంస్థ 'పెంగ్విన్' సిద్ధమైంది. ఈ ఏడాది జూన్, జులైలో పుస్తకాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించింది కూడా! వరవరరావు పుస్తకాన్ని విడుదల చేయడానికి 'పెంగ్విన్' యాజమాన్యం న్యాయపరంగా సలహాలు, సూచనలు కూడా తీసుకున్నది. పుస్తకం విడుదలకు న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులూ లేవని, కోర్టు నుంచి కూడా ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం. అయితే తెరవెనుక ఏం జరిగిందో తెలియదు. పుస్తకం విడుదలకు 'పెంగ్విన్' సంస్థ వెనుకాడుతోందని వార్తలు వెలువడ్డాయి.