Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్వెస్టర్లకు హెచ్చరిక
- ఆర్థిక నిపుణుల విశ్లేషణ
- ఇష్యూకు నేడే చివరి రోజు
- ఇప్పటికీ 50 శాతం దాటని సబ్స్క్రిప్షన్
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వస్తోన్నట్లు ప్రకటించిన పేటియం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్‌కు ప్రతికూల అంశాలు ఎదురవుతున్నాయి. ఈ ఫిన్‌టెక్ కంపెనీలో పెట్టుబడులు అధిక రిస్కుతో కూడుకున్నవని ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఏండ్లు గా నష్టాల్లో కొనసాగుతున్న పేటీఎం విలువ మాత్రం భారీగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ''పేటీఎం అంశంలో నెట్వర్క్ బలంగా ఉంది. వ్యాపారుల పరంగా అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వేదిక. దీర్ఘకాలంలో లాభాలు సాధించవచ్చు. అయితే ఈ ఐపీఓలో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. మధ్యస్త, దీర్ఘ కాలంలో రాబడులు రావొచ్చు. డిమాండ్ పెరుగొచ్చు. అయితే ఇతర కంపెనీల తరహా లిస్టింగ్ సమయంలో అద్బుతం జరగకపోవచ్చు'' అని'' అని అల్డెర్ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ రాఖి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కంపెనీ ఐపీఓ తొలి రోజు సోమవారం 17 శాతం సబ్స్క్రిప్షన్ అయ్యింది. మంగళవారం నాటికి 48 శాతానికి చేరుకుంది. మొత్తంగా 4.83 కోట్ల ఈక్విటీ షేర్లకు గాను 2.32 కోట్ల సూచీలకు బిడ్డింగ్‌లు నమోదయ్యాయి. ఇష్యూకు కేవలం బుధవారం ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఉత్కంట నెలకొంది. నవంబర్ 10న ఈ ఐపీఓ ముగియనుంది. 15న షేర్లు కేటాయించనున్నారు. ఈ నెల 18న బీఎస్ఈ, నిఫ్టీల్లో లిస్టింగ్ కానుంది. ఈ సంస్థ రూ.18,300 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా ఐపీఓకు వచ్చింది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్లకు రూ.8,235 కోట్ల విలువ చేసే షేర్లను కేటాయించింది. ఈ కేటగిరీలో సింగపూర్‌కు చెందిన జీఐసీ, కెనాడ సంస్థ సీపీపీఐబీ, బ్లాక్‌రాక్, అబూదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సంస్థలు ప్రాథమిక దశలోనే వాటాలను పొందాయి. స్టాక్ మార్కెట్లో మరో రూ.10వేల కోట్ల వాటాలను విక్రయిస్తుంది. ఒక్కో షేర్ విలువ శ్రేణీని రూ.2,080-2,150గా నిర్ణయించింది. పేటియం విలువను రూ.1.39 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఈ సంస్థకు 33.7 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
నష్టాల్లో కొనసాగుతున్న ఈ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ విలువను అధికంగా చేసి చూపించారని నిపుణులు పేర్కొంటున్నారు. ''వన్ 97 కమ్యూనికేషన్స్ విలువ 20 బిలియన్ డాలర్లు (రూ.1.39 లక్షల కోట్లు)గా ఉంటుందని ఎవరు లెక్క గట్టారు. ఈ షేర్ల కొనుగోలు, పెట్టుబడులకు సానుకూలంగా ఉండకపోవచ్చు.'' అని న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అశ్వత్ దామోదరన్ పేర్కొన్నారు. ఇలాంటి స్టాక్ల్లో ఇన్వెస్టర్లు తమ పోర్టుపోలియోలో 5 శాతం లేదా 10 శాతం వరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చన్నారు. 25 శాతం లేదా 40 శాతం వరకు పెట్టుకోకూడదని అశ్వత్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.
పేటీఎం నూతన వినియోగదారులను మరింత ఆకర్షించలేకపోతే, లావాదేవీలు పెరగకపోతే, టెక్నలాజీ మౌలిక వసతులను మెరుగుపర్చుకోలేకపోతే ఇన్వెస్టర్లు రిస్కులో పడుతారని మార్వడి ఫైనాన్సీయల్ సర్వీసెస్ విశ్లేషించింది. ఈ నష్టాల పేటీఎం కంపెనీ విలువ చాలా ఎక్కువగా ఉందని.. ఈ ఐపీఓను ఇన్వెస్టర్లు దూరంగా ఉంటేనే బాగుంటుందని సూచించింది. కంపెనీ రెవెన్యూ మాత్రమే పెరగడం కాదని.. దీని లాభాలు అత్యంత కీలకమని ఆర్థిక నిపుణులు కెఆర్ చోక్సీ పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాలు, ప్రగతి కీలకమన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పేటీఎం రూ.1,704 కోట్ల నష్టాలు చవి చూసింది. ఇంతక్రితం 2019-20లోనూ రూ.2,943.32 కోట్ల నష్టాలు ప్రకటించింది. తొలి రెండు రోజుల్లో 50 శాతం సబ్స్క్రిప్షన్ కూడా కాకపోవడంతో.. ఇక ఇష్యూకు ఒకే రోజు మిగిలి ఉండటంతో.. ఏమి జరుగుతుందోనని మార్కెట్ వర్గాలు, నిపుణులు, ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు.