Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచిత బియ్యం పొడిగించాలి..
- ఎఫ్‌సీఐ గోదాముల్లో భారీగా ఆహార నిల్వలు
- మరోవైపు ఆకలితో అలమటిస్తున్న పేదలు, మధ్య తరగతి : కేంద్రానికి ఆహార హక్కుల ప్రచార వేదిక లేఖ
- సంక్షోభ సమయంలో 80 కోట్ల మందికి సాయంగా నిలబడాలని విన్నపం
- రికార్డుస్థాయిలో నిల్వలున్నా సాయం అందటం లేదు..
సెప్టెంబర్ 2021నాటికి దేశవ్యాప్తంగా ఎఫ్‌సీఐ గోదాముల్లో 9కోట్ల టన్నుల ఆహార నిల్వలున్నాయి. మరోవైపు కరోనా దెబ్బకు ఉపాధి పోయిన కోట్లాది పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఈ నవంబర్ నెలతో ఉచిత రేషన్ ఆపేయాలని కేంద్రం నిర్ణయించటం అన్యాయం. గోదాముల్లో ఉన్న ఆహార నిల్వల్ని ఉపయోగించి మరికొంత కాలం ఉచిత రేషన్ అమలుజేయాలని 'ఆహార హక్కుల ప్రచార వేదిక' కేంద్రానికి లేఖ రాసింది.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం అంతాఇంతా కాదు. చేతిలో చిల్లిగవ్వలేకుండా.. నిరుపేదలు పట్టణాల నుంచి గ్రామా లకు తిరుగు ప్రయాణమయ్యారు. తినడానికి తిండిలేక అలమటిం చారు. ఆకలి చావులకు గురయ్యారు. ఆ మహమ్మారి సంక్షోభం కారణం గా కోట్లాది మంది ఉపాధి కోల్పో యారు. ఇప్పటికీ నిరుద్యోగ సమస్య వేధిస్తూనే ఉన్నది. కోట్లాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. చాలా మంది ఆకలి కొరల్లోకి జారుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనే రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా రేషన్ అందిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా రేషన్‌ను అందించింది.
అయితే, ఉచిత రేషన్ పథకం ఈ నెల 30 నుంచి నిలిపివేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలోనే ఉచిత రేషన్ అందించడాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని డిమాండ్ చేస్తూ ఆహార హక్కు ప్రచార వేదిక (ఆర్టీఎఫ్సీ).. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించాలని ఇదివరకే సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు కేంద్రాన్ని కోరారు. ఆర్టీఎఫ్సీ కేంద్రానికి రాసిన లేఖలో ''కరోనా మహమ్మారి కారణంగా ప్రజలపై ఆర్థికభారం పడింది. కొట్లాది మంది ఆకలి కొరల్లోకి జారుకున్నారు. కోవిడ్-19 సృష్టించిన ఈ ఇబ్బందులను ఎదుర్కొవడంలో ఉచిత రేషన్ అందించడం.. ఎన్ఎఫ్సీఏ కింది జాబితా చేయబడిన 80 కోట్ల మంది భారతీయులకు మద్దతు ఇవ్వడానికి ఇది చాలా అవసరమైన చర్య'' అని పేర్కొంది. అలాగే, మహమ్మారి ప్రభావం ఇప్పటికీ కొనసాగుతున్నదనీ, ప్రజలపై ఆర్థిక ప్రభావం, అనిశ్చితి, రికార్దు స్థాయిలో ఉద్యోగాలు కోల్పోవడం, ఇప్పటికీ ఉపాధి లేని వారు అధికంగా ఉండటం వంటి పలు అంశాలను ఈ లేఖ ఎత్తిచూపింది. ప్రస్తుతం తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్న సమయం.. ఆహార ధాన్యాల నిల్వలు రికార్డు స్థాయిలో ఉన్నప్పుడు.. ప్రజలు ఆకలి కొరల్లో చిక్కుకుని ఉన్న సమయంలో.. రేషన్ అవసరమైన వారికి సాయం, రేషన్ కార్డు ఉన్న వారికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను (పీడీఎస్) సార్వత్రికం చేయాల్సిన అవసరం చాలా ఉన్నదని లేఖ పేర్కొంది. ఈ ప్రయోజనాలను విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సబ్సిడీ ధరలకు అదనపు ఆహార ధాన్యాన్ని కూడా అందించాలని డిమాండ్ చేసింది. కరోనా మహమ్మారి మన సామాజిక భద్రతా వ్యవస్థ బలహీనతను, లోపాలను, కార్మికవర్గంలో స్థితిస్థాపకత లోపాన్ని కూడా బహిర్గతం చేస్తుందని ఆర్టీఎఫ్సీ తెలిపింది. ఆర్టీఎఫ్సీ ప్రకారం దేశ జనాభాలో దాదాపు 42శాతం మందికి ఎన్ఎఫ్సీఏ రేషన్ కార్డులు లేవు. ఇందులో పీఎంజీకేఏవై పథకం నుంచి ప్రయోజనాలు పొందలేని అనేక నిస్సహాయ వర్గాలు న్నాయి. ''ఎవరినీ మినహాయించకుండా చూసుకోవడానికి పీడీఎస్‌ను సార్వత్రికం చేయడం, రేషన్ అవసరమైన ప్రతి ఒక్కరికి అవి అందేలా చర్యలు తీసుకోవడం చాలా అవసరం. పీడీఎస్‌లో ఉచితంగా రేషన్‌లో పప్పుధాన్యాలు, వంటనూనెలను చేర్చాలి'' అని డిమాండ్ చేసింది. గతంలో రేషన్ సరుకుల అందజేతపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ''ఉచిత రేషన్ ఆపడానికి బదులు.. కేటాయింపులు పెంచాలనీ, వలస కార్మికులు, సెక్స్ వర్కర్లు, నిరాశ్రయులు, ట్రాన్స్జెండర్లు, అసంఘటిత రంగ కార్మికులు సహా ఆర్థికంగా బలహీనంగా ఉన్న అన్ని సమూహాలకు ఆహార ధాన్యాలను అందించాలి'' అని లేఖ పేర్కొంది.