Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు
- క్షమాపణాలు చెప్పాలంటూ కాంగ్రెస్ డిమాండ్
భోపాల్: బ్రాహ్మణులు, బనియాలు తమ రెండు జేబుల్లోని వ్యక్తులంటూ బీజేపీ ప్రధాన కార్యధర్శి మురళీధర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భోపాల్‌లో జరిగిన ఓ సమావేశంలో మురళీధర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మురళీధర్ రావు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ.. తీవ్ర విమర్శలు గుప్పించింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యల వీడియోపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్‌నాథ్ స్పందిస్తూ.. బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. బీజేపీ సబ్కా సాథ్.. సబ్కా వికాస్ నినాదం చెబుతోంది కానీ ఆ పార్టీ నేత మాత్రం బ్రాహ్మణులు, బనియాలు తమ జేబుల్లో ఉన్నారని మాట్లాడతారని విమర్శించారు. వారిపై బీజేపీ హక్కును ప్రదర్శించడం.. ఆ వర్గాలను అవమనించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన ఈ వర్గాలకు ఎలాంటి గౌరవం ఇస్తారని ప్రశ్నించారు. అధికారం చేతుల్లో ఉండటంతో బీజేపీ నేతలు దురహంకారం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా వర్గాలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.కాగా, మురళీధర్‌రావు మాట్లాడుతూ.. 'బీజేపీ, బీజేపీ పాలిత ప్రభుత్వాలు షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలపై ప్రత్యేక దృష్టి సారించబోతున్నాయనీ, వారి ఓటు బ్యాంకు గురించి కాకుండా.. వెనకబాటుతనం, ఉపాధి, విద్య వంటి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. ఈ క్రమంలో 'బీజేపీ అనేది బ్రాహ్మణలు, బనియాల పార్టీ అనే మాట వినిపిస్తుంది. బీజీపీ నినాదం వచ్చేసి సబ్కా సాథ్.. సబ్కా వికాస్.. అలాంటప్పుడు మీరు ఎస్సీ, ఎస్టీలపై ప్రత్యేక దృష్టి పెట్టడం గురించి మాట్లాడుతున్నారేంటి?'' అని మీడియా ప్రశ్నించగా... తన జేబుల వైపు చూపిస్తూ.. 'నా జేబుల్లో బ్రాహ్మణులు, బనియాలు ఉన్నారు' అని అన్నారు.