Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12కు చేరిన మృతుల సంఖ్య
- చెన్నైలో అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ ఆదేశాలు
- పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
చెన్నై : తమిళనాడులో వానలు దంచికొడుతున్నాయి. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. భారీ వర్షాలతో ముంచెత్తిన వరదల కారణంగా ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12కు పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కెకెఎస్ఎస్ఆర్ రామచంద్రన్ వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా రాజధానితో పాటు సరిహద్దు ప్రాంతాలు నీట మునిగాయి. వందలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది ప్రజలను సహాయ శిబిరాలకు తరలించారు. రోడ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. చాలా చెట్లు నేలకూలాయి. ఈ నేపథ్యంలోనే చెన్నై నివాసితులు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తమ ఇండ్ల నుండి బయటకు రావాలనీ, అలాగే, తగినంత ఆహారం, నీటిని అందుబాటులో ఉండేలా చూసుకోవాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ప్రజలను కోరింది. అలాగే, వరద సంబంధిత ఫిర్యాదులు, సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 044-25619206, 044-25619207, 044-25619208లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ప్రభుత్వం 10, 11 తేదీలను విద్యాసంస్థలకు సెలవు దినాలుగా ప్రకటించింది.
ఇదిలావుండగా, చెన్నై, కాంచీపురం, తిరువల్లూర్, చెంగల్పట్టు, కడలూర్, నాగపట్టణం, తంజావూరు, తిరువారూర్, మైలదుత్తురారులలో భారీ వర్షాల కారణంగా వాతావరణ విభాగం (ఐఎండీ) ఇదివరకే రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా కడలూర్, విల్లుపురం, శివమొగ్గ, రామనాథపురం, కరైకాల్ జిల్లాలకు కూడా ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేసింది. అల్పపీడనం గురువారం తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు దిశగా కదలుతుందని అంచనా వేసింది. ఒక్క చెన్నైలోనే లోతట్టు ప్రాంతాల్లో వరద నీటిని తొలగించడానికి 500 మోటార్లు, 60 పంపులు ఏర్పాటు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగించడం, అక్కడి ప్రజలకు నిత్యావసరాలైన ఆహార పదర్థాలను అందించడం కోసం 53 బోట్లను అందుబాటులోకి ఉంచామని తెలిపారు. అధికారులకు, ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 434 సైరన్ టవర్లను సైతం ఏర్పాటు చేసింది. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర సీఎం స్టాలిన్ వర్షాలు తగ్గుముఖం పట్టేంతవరకు అమ్మ క్యాంటీన్ల ద్వారా ఉచితంగా భోజనం అందిస్తామని వెల్లడించారు. ఇదిలావుండగా, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తమిళనాడుకు ఆర్థిక సహాయం అందించాలనీ, వెంటనే కేంద్ర ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసేలా చొరవచూపాలని ప్రతిపక్ష నేత, మాజీ సీఎం పన్నీర్ సెల్వం... ప్రధాని మోడీకి లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితులను గురించి లేఖలో వివరించారు.