Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం కోర్టును ఆశ్రయించిన జర్నలిస్టులు
- త్రిపురలో 102 మందిపై యూఏపీఏ కేసులు నమోదు
న్యూఢిల్లీ : అన్యాయంగా, అక్రమంగా తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని త్రిపురకు చెందిన జర్నలిస్టు శ్యామ్ మీరా సింగ్‌తో పాటు పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. త్రిపురలో ఇటీవలి మసీదుల దహనం వంటి ఘటనలకు సంబంధించిన అంశాలను రిపోర్టు చేసిన జర్నలిస్టులు, పరిశీలించిన న్యాయవాదులు, ఘటనను ఖండించిన సామాజిక కార్యర్తలపైన అక్కడి ప్రభుత్వం ఉపా కింద కేసు నమోదు చేసింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారంల్లో పోస్ట్‌ల ద్వారా త్రిపురలో కొనసాగుతున్న మత హింసను ప్రస్తావించినందుకు న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలతో సహా 102 మందిపై ఉపా చట్టం కింద అభియోగాలను త్రిపురలోని బీజేపీ ప్రభుత్వం మోపింది.
ఈ కేసులు మొదట పశ్చిమ అగర్తల పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. తరువాత ఆ కేసులను త్రిపుర క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఈ కేసుల్లో మొదటి ఇద్దరు న్యాయవాదులపై పెట్టారు. రాష్ట్రంలో మతపరమైన హింసపై దర్యాప్తు చేస్తున్న నిజనిర్ధారణ బృందంలో భాగమైన న్యాయవాదులు అన్సార్ ఇండోరి, ముకేశ్లపై నమోదైంది. 'త్రిపురలో మానవత్వం దాడికి గురవుతోంది, ముస్లిం లైవ్స్ మ్యాటర్' అని నిజనిర్ధారణ బృందం నివేదిక తర్వాత వారిపై అభియోగాలు నమోదయ్యాయి. ముస్లింలకు చెందిన 12 మసీదులు, తొమ్మిది దుకాణాలు, మూడు ఇండ్లను ధ్వంసం చేసిన విషయాన్ని నివేదిక స్పష్టం చేసింది.నవంబర్ 4న త్రిపుర పోలీసులు కొంతమంది పోస్టులు, వివిధ నేరాలకు పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేశామనీ, ద్వేషాన్ని సష్టించే ఉద్దేశంతో దురుద్దేశపూరిత ప్రచారంలో పాల్గొన్నందుకు నలుగురిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.
ఉపా కింద అభియోగాలతో పాటు, 102 మంది సోషల్ మీడియా ఖాతాదారులపై సెక్షన్ 153 (ఎ) (వివిధ సమూహాల మధ్య శత్రుత్వం, అసమానతను ప్రోత్సహించడం), 153 (బి) (అసమ్మతిని కలిగించే వాదనలను ప్రచురించడం) సహా వివిధ ఐపీసీ సెక్షన్లతో అభియోగాలు మోపారు.త్రిపుర పోలీసుల చర్యలను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఈజీఐ) ఖండించింది. పోలీసుల చర్యలతో తాము ''తీవ్రంగా దిగ్భ్రాంతికి గురయ్యాం'', ఇది త్రిపుర ప్రభుత్వం దృష్టిని మరల్చడానికి చేసిన ప్రయత్నం'' అని ఒక ప్రకటనలో పేర్కొంది. మత హింసను నియంత్రించడంలో ప్రభుత్వ స్వంత వైఫల్యమని స్పష్టం చేసింది. కేవలం ''త్రిపుర మండుతోంది'' అని ట్వీట్ చేసినందుకే తనపై ఉపా కింద కేసు నమోదు చేశారని సింగ్ ఆరోపించారని గిల్డ్ పేర్కొంది.