Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 80 శాతం ప్రీమియంతో నమోదు
- కుబేరురాలిగా ఫల్గుణి నాయర్
- పేటిఎం ఐపీఓకు ఉపశమనం
ముంబయి : సౌందర్య, సంరక్షణ ఉత్పత్తుల ఈ-కామర్స్ వేదిక 'నైకా' లిస్టింగ్ తొలి రోజు మార్కెట్లలో కేక పెట్టించింది. బుధవారం ఈ సంస్థ షేర్లు ఏకంగా 80 శాతం ప్రీమియంతో లిస్టింగ్ కావడం విశేషం. ఈ బ్యూటీ స్టార్టప్ ఇష్యూ ధర రూ.1,125గా నిర్ణయించగా.. 79.37 శాతం అధిక విలువతో లిస్టింగ్ కావడంతో మదుపర్ల పంట పండింది. బీఎస్ఈలో ఓ దశలో ఏకంగా 89.24 శాతం పెరిగి రూ.2,129 వద్ద నమోదయ్యింది. దీంతో స్టాక్ మార్కెట్లో ఈ సంస్థ విలువ రూ.1 లక్ష కోట్లు దాటింది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1 మధ్య జరిగిన ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌లో 81.8 రెట్ల డిమాండ్ నెలకొంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.5,352 కోట్లు సమీకరించింది.
స్వీయ నిర్మిత బిలియనీర్‌గా ఫల్గుణి
ఫల్గుణి నాయర్ ప్రారంభించిన ఈ బ్యూటీ స్టార్టప్ నైకాలో సగం షేర్లు ఆమెవే. నేడు ఆ షేర్లు భారీగా పెరగడంతో ఇప్పుడు 6.5 బిలియన్ డాలర్లు(రూ.48 వేల కోట్లు)తో అత్యంత సంపన్నురాలుగా మారారని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. ఫల్గుణి దేశంలోనే అత్యంత సంపన్న స్వీయ నిర్మిత మహిళా బిలియనీర్‌గా నిలిచారని పేర్కొంది. 2012లో నైకాని స్థాపించి ఆకర్షణీయమైన బాలీవుడ్ నటీనటులు, సెలబ్రిటీల డెమో వీడియోలతో ఆన్లైన్ విక్రయాలను సాగించి ఒక్కసారిగా దాదాపు 70 స్టోర్లను ప్రారంభించింది. ఈ సంస్థ పోర్టుపోలియోలో దాదాపుగా 1500 వరకు ఉత్పత్తులు ఉన్నాయి.
పేటీఎం ఫుల్ సబ్స్క్రిప్షన్
డిజిటల్ చెల్లింపుల సేవల సంస్థ పేటిఎంకు చెందిన మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ఐపీఓకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. తొలి రెండు రోజుల్లో కేవలం 48 శాతం మాత్రమే సబ్స్క్రిప్షన్ కాగా.. మూడో రోజు బుధవారం ముగింపు నాటికి 1.89 రెట్ల సబ్స్క్రిప్షన్ అయ్యింది. మొత్తంగా 4.83 కోట్ల ఈక్విటీ షేర్లకు గాను 9.12 కోట్ల షేర్లకు బిడ్డింగ్‌లు నమోదయ్యాయి. నవంబర్ 10న ఈ ఐపీఓ ముగియనుంది. 15న షేర్లు కేటాయించనున్నారు. ఈ నెల 18న బీఎస్ఈ, నిఫ్టీల్లో లిస్టింగ్ కానుంది. ఈ సంస్థ రూ.18,300 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా ఐపీఓకు వచ్చింది.