Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నందిగామలో జాతీయ రహదారిపై రాస్తారోకో, మానవహారం
- 31 మంది నేతలు, విద్యార్థుల అరెస్టు
నందిగామ : కృష్ణాజిల్లా నందిగామలోని కెవిఆర్ కళాశాలను ఎయిడెడ్గా కొనసాగించాలని గత మూడు రోజులుగా చేస్తోన్న ఉద్యమం పోలీసుల జోక్యంతో ఉద్రిక్తతకు దారి తీసింది. కళాశాల విద్యార్థులు బుధవారం 65వ నంబరు జాతీయ రహదారి సమీపంలోని నందిగామ గాంధీ సెంటర్ వద్ద బైఠాయించి రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. పోలీసులు పలువురిని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. తొలుత విద్యార్థులు నందిగామ కెవిఆర్ కళాశాల నుండి ప్రదర్శనగా నందిగామ గాంధీసెంటరుకు చేరుకున్నారు. విద్యార్థులు మూకుమ్మడిగా గాంధీసెంటరు వద్ద బైఠాయిండంతో రెండు గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు వచ్చి ఈ కళాశాలను ఎయిడెడ్గానే కొనసా గిస్తామని హామీ ఇవ్వాలని నేతలు, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఎంతసేపటికీ రాకపోవడంతో పోలీసులు విద్యార్థులతో చర్చలు జరిపారు. చర్చలు ఫలించకపోవడంతో నందిగామ ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ దశలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన విరమించేది లేదని నినాదాలు చేశారు. పలువురు విద్యార్థులను, ఎస్ఎఫ్ఐ నేతలను బలవంతంగా అరెస్టు చేసి కంచికచర్ల స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసిన విద్యార్థులను, నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నందిగామ పోలీసుస్టేషన్ వరకు విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.