Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3 లక్షల కోట్ల వ్యాపారాన్ని ఆశిస్తున్న సీఏఐటీ
- ఈనెల 14 నుంచి నెలరోజుల వరకు 25 లక్షల పెండ్లిండ్లు జరగనున్నట్టు అంచనా
న్యూఢిల్లీ : దీపావళి పండుగ సందర్భంగా దేశంలో వ్యాపారం జోరుగా సాగింది. అయితే, ఈ నెలలో ప్రారంభం కానున్న పెండ్లిండ్ల సీజన్లోనూ ఇదే విధమైన బలమైన వ్యాపారాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఆశిస్తున్నది. '' ఈనెల 14న దేవ్ ఉతన్ ఏకాదశి నుంచి డిసెంబర్ 13 వరకు దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల పెండ్లిండ్లు జరగనున్నాయని అంచనా. అయితే, వివాహ కొనుగోళ్లు, సంబంధిత సేవల ద్వారా దాదాపు రూ. 3 లక్షల కోట్ల భారీ వ్యాపారం జరిగే అవకాశం ఉన్నది'' అని సీఏఐటీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. కాగా, దేశరాజధాని ఢిల్లీలోనే 1.5 లక్షలకు పైగా వివాహాలు జరగనున్నాయనీ, వీటి నుంచి దాదాపు రూ. 50 వేల కోట్లకు పైగా వ్యాపారం జరిగే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. కరోనా మహమ్మారి, ప్రభుత్వ విధించిన ఆంక్షల కారణంగా గత పెండ్లిండ్ల సీజన్లలో మార్కెట్ డల్‌గా మారిన విషయం విదితమే. వెడ్డింగ్ సీజన్లో మంచి వ్యాపారావకాశాలున్నాయన్న అంచనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాపారులు విస్తృతమైన ఏర్పాట్లను చేశారని సీఏఐటీ జాతీయాధ్యక్షుడు బీసీ భర్తియా వెల్లడించారు. కాగా, వెడ్డింగ్ సీజన్‌కు ముందు ఇండ్లకు పెయింటింగ్, రిపేర్‌కు సంబంధించిన వ్యాపారం భారీగా జరిగిందని సీఏఐటీ జనరల్ సెక్రెటరీ ప్రవీణ్ ఖండెల్వాల్ తెలిపారు. '' ఇదే కాకుండా, ఆభరణాలు, చీరెలు, ఇతర వస్త్రాలు, ఫుట్‌వేర్, శుభలేఖలు, డ్రైఫ్రూట్స్, స్వీట్లు, పండ్లు, గ్రోసరీ, ధాన్యాలు, డెకరేషన్ వస్తువులు, విద్యుత్ వినియోగం, ఎలక్ట్రానిక్స్, ఇతర గిఫ్ట్ ఐటెమ్స్ మొదలైన వాటికి పెండ్లిండ్ల సీజన్లో సాధారణంగా డిమాండ్ ఉంటుంది. ఈ ఏడాది చక్కడి వ్యాపారాన్ని ఆశిస్తున్నాం'' అని ఆయన వెల్లడించారు. ఈ సీజన్లో దాదాపు 5 లక్షల పెండ్లిండ్లు ఒక్కో వెడ్డింగ్‌కు చొప్పున రూ. 2 లక్షల వరకు ఖర్చు చేయొచ్చనే అంచనా ఉన్నట్టు తెలిపారు. '' మరో ఐదు లక్షల వెడ్డింగ్స్‌లో ఒక్కో దానికి దాదాపు రూ. 5 లక్షల చొప్పున ఖర్చు అవుతుంది. అలాగే, పది లక్షల పెండ్లిండ్లలో ఒక్కో వివాహానికి రూ. పది లక్షల చొప్పున, 4 లక్షల వివాహాలలో ఒక్కోదానికి రూ. 25 లక్షల చొప్పున, 50 వేల వివాహాలలో ఒక్కో వెడ్డింగ్‌కు రూ. 50 లక్షల చొప్పున, మరో 50 వేల పెండ్లిండ్లలో ప్రతి ఈవెంట్‌కు రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ చొప్పున ఖర్చు అవుతుంది. మొత్తానికి ఈ వెడ్డింగ్ సీజన్లో రూ. 3 లక్షల కోట్ల వ్యాపారం జరగుతుంది'' అని ఆయన అంచనా వేశారు.