Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 22నుంచి అనుమతి
- 9 నెలల కనిష్టానికి కొత్త కేసులు
- గణనీయంగా పెరిగిన రికవరీ రేటు
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ప్రయాణికుల కోసం 'గుర్తించిన కోవిడ్ టీకాల జాబితా'లో భారత్‌కు చెందిన కోవాగ్సిన్ను చేర్చుతున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ రాకపోకలను సులభతరం చేసేందుకు మరిన్ని నిర్ణయాలు వెలువరించింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్ మంగళవారం ట్విట్టర్లో సందేశాన్ని పోస్ట్ చేశారు. ''బ్రిటన్‌కు వచ్చే భారత ప్రయాణికులకు శుభవార్త. నవంబర్ 22 నుంచి కోవాగ్సిన్తో సహా డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వినియోగానికి గుర్తించిన టీకాలు వేసుకొని ఇక్కడికి చేరుకున్నాక ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు'' అని పేర్కొన్నారు.
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్సిన్ను ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర వినియోగ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం కోవాగ్సిన్తోపాటు చైనాకు చెందిన సినోవాక్, సినోఫార్మ్‌లనూ గుర్తించింది. ఈక్రమంలో వ్యాక్సినేషన్ పూర్తయిన ప్రయాణికులు బయలు దేరడానికి ముందు, వచ్చాక 8రోజులకు పరీక్ష చేయించుకోవటం, ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. బ్రిటన్ ప్రభుత్వం ఇదివరకే కోవిషీల్డ్‌ను గుర్తించింది.
9 నెలల కనిష్టానికి కేసుల సంఖ్య
దేశంలో మరోసారి కరోనా కేసులు తగ్గాయి. 266 రోజుల(9నెలలు) కనిష్టానికి చేరి..10వేలకు పడిపోయాయి. రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడగా...క్రియాశీల రేటు క్రమంగా తగ్గుతోంది. ఈమేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెలువరించింది. 10,85,848మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..10,126మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కొత్త కేసులు ఫిబ్రవరి ప్రారంభం నాటి స్థాయికి తగ్గాయి. గత ఏడాది ప్రారంభం నుంచి దేశంలో 3.43కోట్ల మందికి కరోనా సోకింది. వారిలో 3.37కోట్ల మంది వైరస్‌ను జయించారు. సోమవారం ఒక్కరోజే 11,982మంది కోలుకున్నారు. ప్రస్తుతం కోవిడ్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 1.40లక్షలకు తగ్గింది. ఈ సంఖ్య 266 రోజుల కనిష్టానికి చేరింది. దాంతో క్రియాశీల రేటు 0.41శాతానికి తగ్గగా..రికవరీరేటు 98.25శాతానికి పెరిగింది. ఇప్పటివరకూ 4,61,389మంది మహమ్మారికి బలయ్యారు. మరోవైపు సోమవారం దేశవ్యాప్తంగా 59లక్షల మందికిపైగా టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 109కోట్ల మార్కును దాటింది.
పలు దేశాల్ని వణికిస్తున్న డెల్టా వేరియెంట్
కరోనా మహమ్మారి వెలుగు చూసి రెండేండ్లు సమీపిస్తున్నప్పటికీ పలు దేశాల్లో వైరస్ ఉధృతి మాత్రం అదుపులోకి రాలేదు. కోవిడ్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను విస్తృతంగా పంపిణీ చేస్తున్నా..మహమ్మారి నియంత్రణలోకి రావటం లేదు. ముఖ్యంగా డెల్టా వేరియెంట్ ప్రభావంతో పలు దేశాల్లో మరోసారి విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య తాజాగా 25కోట్ల మార్క్‌ను దాటింది. అత్యధికంగా అమెరికాలో ఇప్పటివరకు 4.6కోట్ల కేసులు నమోదుకాగా, భారత్‌లో దాదాపు 3కోట్ల 43లక్షలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య ఈమధ్యే 50లక్షలు దాటిన విషయం తెలిసిందే.