Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'రాఫెల్ డీల్'పై మోడీ సర్కార్ మౌనం
- భారత్‌లో సంచలనం సృష్టిస్తున్న 'మీడియాపార్ట్' తాజా కథనం
- 'యూపీఏ' రాఫెల్ ఒప్పందంలో మధ్యవర్తికి ముడుపులు
- మళ్లీ అదే మధ్యవర్తితో మోడీ సర్కార్ కొత్త ఒప్పందం
- రూ.65కోట్లు ముడుపులు తీసుకున్న గుప్తాతో ఎందుకు చేతులు కలిపారు?
- డస్సాల్ట్‌ను మోడీ సర్కార్ ఎందుకు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టలేదు?
రాఫెల్ డీల్‌పై ఫ్రాన్స్‌లోని పరిశోధనాత్మక జర్నల్ 'మీడియాపార్ట్' వార్తా కథనం భారత్‌లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి తొలుత యూపీఏ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో అవకతవకలు జరిగాయని 'మీడియాపార్ట్' తాజాగా పేర్కొన్నది. యుద్ధ విమానాల తయారీ కంపెనీ 'డస్సాల్ట్ ఏవియేషన్' మధ్యవర్తులకు భారీ మొత్తంల ముడుపులు అందజేసిందన్నది ఇందులో ప్రధాన అంశం. ఇదంతా సీబీఐకి తెలుసు. ఇవన్నీ తెలిసీ..మోడీ సర్కార్ 'డస్సాల్ట్ ఏవియేషన్'తో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? అన్నది ఇక్కడ అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
న్యూఢిల్లీ : 'రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం' (రాఫెల్ డీల్)లో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. ఒకటీ..రెండుకోట్లు కాదు..రూ.59వేల కోట్ల విలువజేసే ఒప్పందమిది. ఈ వ్యవహారంలో మోడీ సర్కార్ తీరు అత్యంత వివాదాస్పదంగా తయారైంది. అవినీతి జరిగిందని బలమైన ఆరోపణలు వస్తున్నా..మోడీ సర్కార్ సమాధానం చెప్పటం లేదు. సుప్రీంకోర్టు అడిగినా..'ఒప్పందం ఇంటర్ గవర్నమెంటల్( రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన) అత్యంత రహస్యం చెప్పం..గాక..చెప్ప''మని కేంద్రం సమాధానమిస్తోంది. ఈనేపథ్యంలో తాజాగా 'మీడియాపార్ట్' మరో బాంబులాంటి సంగతి బయటపెట్టింది. డస్సాల్ట్‌తో యూపీఏ కుదుర్చుకున్న ఒప్పందంలో మధ్యవర్తికి ముడుపులు అందాయని తెలిసీ..మోడీ సర్కార్ ముందుకెళ్లింది. ముడుపులు స్వీకరించిన సుశేన్ గుప్తాపై, డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీపై చర్యలు తీసుకోలేదు.
పాత వాళ్లతో కొత్త ఒప్పందం
యూపీఏ ఒప్పందంలో (2007-12మధ్యకాలంలో) మధ్యవర్తిగా ఉన్న సుశేన్ గుప్తాకు రూ.65కోట్లు ముడుపులు ఇచ్చినట్టు డస్సాల్ట్ అధికారిక పత్రాల్లో నమోదైఉంది. వీటిని సేకరించిన 'మీడియాపార్ట్' ఆ విషయాన్ని బయటపెట్టింది. ఈ సంగతి 2015లో మోడీ సర్కార్‌కూ తెలిసినా..కొత్త ఒప్పందం చేసుకుంది. అందులో 'యాంటీ కరప్షన్ క్లాజ్'ను తొలగిస్తూ 'కొత్త రాఫెల్ ఒప్పందా'నికి మోడీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
ముడుపులు తీసుకున్న మధ్యవర్తితోనే
'సుశేన్ గుప్తా' ముడుపులు స్వీకరించాడన్నది పక్కా ఆధారాలతో సహా బయటపడింది. ఈ అవినీతి బాగోతం నడిపింది ఫ్రాన్స్‌లో యుద్ధ విమానాల తయారీ కంపెనీ 'డస్సాల్ట్ ఏవియేషన్'. దీనిపై ఫ్రాన్స్‌లో విచారణ జరిపిన 'అవినీతి వ్యతిరేక ఏజెన్సీ'(ఎఎఫ్ఏ) ముడుపులు నిజమేనని తేల్చింది. అయినాకూడా మధ్యవర్తి సుశేన్ గుప్తా, డస్సాల్ట్ ఏవియేషన్‌తో మోడీ సర్కార్ కొత్త ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏముంది?
మళ్లీ అదే సుశేన్గుప్తాతో కొత్త ఒప్పందం
మోడీ సర్కార్ 2015లో చేసుకున్న కొత్త ఒప్పందంలోనూ 'సుశేన్ గుప్తా' పాత్ర ఉందా? అంటే ఉందనే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఒప్పందంలో కీలకమైన అంశాలు చేర్చటంలో, బేరసారాలు, ఒక్కో యుద్ధ విమానానికి ధర నిర్ణయించటం..మొదలైనవన్నీ గుప్తా ఆధ్వర్యంలో జరిగాయని తెలుస్తోంది. ఇదంతా చేసిపెట్టినందుకు డస్సాల్ట్ కంపెనీ నుంచి గుప్తాకు ముడుపులు అందాయని విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి కీలక పత్రాలు డస్సాల్ట్ బయటపెట్టడం లేదు. రహస్యంగా ఉంచుతోంది. ఏమీ లేకపోతే, పారదర్శకమైతే..డస్సాల్ట్ ఆ పత్రాల్ని రహస్యంగా ఎందుకు ఉంచుతోందని 'మీడియాపార్ట్' ప్రశ్నించింది. మోడీ సర్కార్ కుదుర్చుకున్న ఒప్పందంలో 'సుశేన్ గుప్తా'పాత్ర ఉందని ఇండియాకు చెందిన డిటెక్టీవ్స్ కూడా నిర్ధారించారు.
సీబీఐ విచారణ ఎందుకు లేదు?
యూపీఏ ఒప్పందంలో అవినీతి జరిగిందని సీబీఐ, ఈడీ వద్ద ఆధారాలున్నాయి. అక్టోబర్ 2018నాటికి దర్యాప్తు సంస్థల వద్ద గట్టి సమాచారముంది. అయినా మోడీ సర్కార్ కొత్త ఒప్పందంపై ముందుకెళ్లింది. దాదాపు రూ.59వేల కోట్లు చెల్లింపులు చేసింది. ఇదే విషయంపై ప్రశాంత్ భూషణ్, యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాని మోడీ పారిస్ వెళ్లి ఏకపక్షంగా ఒప్పందాన్ని ఓకే చేయటం ఏంటని వారు ప్రశ్నించారు. సీబీఐ విచారణ చేస్తే..మోడీ సర్కార్ అవినీతి బయటపడుతుందనే అప్పటి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ఉన్నఫళంగా తొలగించటం అనుమానాల్ని బలపరుస్తోంది.