Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్నో కిసాన్ మహా పంచాయత్‌కు సన్నాహాలు
న్యూఢిల్లీ : హర్యానాలోని హన్సిలో నిరవధిక ధర్నా కొనసాగుతోంది. గురువారం మినీ సచివాలయం వద్ద భారీ ముట్టడి జరిగింది. బీజేపీ ఎంపీ రామ్‌చందర్ జాంగ్రాకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసన తెలిపినందుకు గాను ముగ్గురు రైతులపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని, లాఠీచార్జి చేసి రైతులను గాయపరిచినందుకు ఆయనపై కేసు పెట్టాలని అక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రైతు కుల్దీప్ రాణా పరిస్థితి కూడా అలానే కొనసాగుంది. అతని కుటుంబానికి హర్యానాలోని ఒక స్వతంత్ర ఎమ్మెల్యే నుంచి నెలవారీ రూ.పదివేల మద్దతు, రూ. రెండు లక్షల నగదు మద్దతు లభించింది. తమ లాఠీచార్జిలో కుల్దీప్ రాణాకు ఎలాంటి గాయాలు కాలేదని హర్యానా పోలీసులు చెబుతున్నారు. ఖేరీ చౌప్తా గ్రామానికి చెందిన మరో రైతు శేఖర్ చంద్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతను కూడా హిసార్‌లోని ఆస్పత్రిలో చేరాడు. రాష్ట్రంలో రైతుల నిరసనల నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కొంతమంది సీనియర్ అధికారులకు కూడా వ్యక్తిగత భద్రతా అధికారులను (పీఎస్ఓ) అందించాలని నిర్ణయించింది. నిరసన తెలుపుతున్న రైతులపై దాడులను ఆపాలని, వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని హర్యానా బీజేపీ-జేజేపీ ప్రభుత్వాన్ని ఎస్కేఎం డిమాండ్ చేసింది.
ఎంఎస్పీ ధరకు కొనకపోవటం వల్లే..
వివిధ ప్రాంతాల నుంచి వరి సేకరణకు సంబంధించిన సమస్యలు, అవకతవకలు బయటపడుతున్నాయని, ప్రభుత్వం ఎంఎస్పీ ధరకు కొనుగోలు చేయకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున దోపిడీకి గురవుతున్నారని ఎస్కేఎం పేర్కొంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి వివిధ రాష్ట్రాల్లో రైతులే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిరసనలు తెలుపుతున్నాయని తెలిపింది. తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్ రాష్ట్రంలోని రైతుల నుంచి వరి ధాన్యాన్ని కేంద్ర ఏజెన్సీలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతోందని పేర్కొంది.
రైతు ఉద్యమం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో దాదాపు పన్నెండు నెలల్లో తొమ్మిది మంది కేవలం ఆత్మహత్య చేసుకున్నారని ఎస్కేఎం తెలిపింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విపరీతమైన చర్య గురించి ఆలోచించవద్దని నిరసనకారులందరికీ ఎస్కేఎం విజ్ఞప్తి చేసింది. రైతు ఉద్యమం మరింత బలంగా విస్తృతంగా పెరుగుతోందని, డిమాండ్లన్నింటినీ సాధించడం ద్వారా ఉద్యమం ముగుస్తుందని ఎస్కేఎం పునరుద్ఘటించింది.
పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో నిరసన చేస్తున్న రైతులపై కాల్పులు జరిపిన ఎస్ఏడీ నాయకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడ చక్కా జామ్ (రహదారి దిగ్బంధం) జరిగింది. దీంతో ఎస్ఎడి నాయకుడు వర్దేవ్ సింగ్ నోని మాన్, అతని డ్రైవర్‌పై హత్యాయత్నం ఆరోపణల కింద కేసు నమోదు చేయబడింది. అయితే, ఎఫ్ఐఆర్లో మరో ఎస్ఏడీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర సింగ్ జిందును ప్రధాన నిందితుల్లో ఒకరిగా పేర్కొనలేదనీ, వెంటనే ఎఫ్ఐఆర్లో ఈ దిద్దుబాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, రైతులపై కాల్పులు జరిపిన ఆయుధాలను వారి నుంచి స్వాధీనం చేసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నవంబర్ 22న జరిగే కిసాన్ మహాపంచాయత్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ రైతు సంఘాలు మహా పంచాయత్‌ను పెద్ద విజయవంతమయ్యేలా చూసేందుకు తమ కేడర్‌ను సమీకరించడంతోపాటు యూపీ, కేంద్ర బీజేపీ ప్రభుత్వాలకు బలమైన సందేశాన్ని ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 26న ఈ చారిత్రాత్మక రైతుల పోరాటానికి మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీకి సమీపంలోని అన్ని మోర్చా స్థలాల్లో భారీ సమావేశాలు జరిగేలా జనసమీకరణ కూడా జరుగుతోంది. వివిధ సుదూర రాష్ట్రాల్లో కూడా నవంబర్ 26న భారీ నిరసనలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.