Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపుర స్థానిక సంస్థల ఎన్నికలు.. అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకోవాలంటూ బెదిరింపులు : సీపీఐ(ఎం)
- ఆధారాలున్నా చర్యలు తీసుకోవడంలేదు: టీఎంసీ
అగర్తల : ప్రజాస్వామిక, ఓటు హక్కు వినియోగంపైనా బీజేపీ వరుసదాడుల పరంపర కొనసాగిస్తున్నదని సీపీఐ(ఎం) ఆరోపించింది. త్రిపురలో త్వరలో జరగబోయే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు తమ అభ్యర్థులపై వరుస దాడులకు పాల్పడుతున్నదని సీపీఐ(ఎం) విమర్శించింది. బీజేపీ దాడుల నేపథ్యంలో లెఫ్ట్‌ఫ్రంట్ 17 మంది అభ్యర్థులను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ కార్యదర్శి జితేంద్ర చౌదరి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారనీ, ఇలాంటి ఘటనలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు మొత్తం 20 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారన్నారు. కాగా, నవంబర్ 25న పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని త్రిపుర రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 25న ప్రకటించింది. ఈ 20 పట్టణ స్థానిక సంస్థలలో మొత్తం 770 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని పేర్కొంది. పోలింగ్ తేదీలు ప్రకటించిన వెంటనే వామపక్ష అభ్యర్థులపై బీజేపీ కార్యకర్తలు వరుస దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ''అభ్యర్థుల ఇండ్లపై దాడులు, పోలీసుల సమక్షంలో బెదిరింపులు చాలాచోట్ల జరిగాయి. కానీ, పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. పశ్చిమ జిల్లాలోని రాణిర్‌బజార్, జిరానియా, ధలై జిల్లాలోని కమ్లాపూర్, గోమతి జిల్లాలోని ఉదయపూర్, సెపాహిజాలా జిల్లాలోని బిషాల్‌గఢ్, దక్షిణ జిల్లాలోని శాంతిర్‌బజార్‌లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని కూడా బీజేపీ కార్యకర్తలు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థానాల్లో మేం నామినేషన్ పత్రాలను దాఖలు చేయలేకపోయాం. ఈ విషయాన్ని పోలీసులు, ఈసీ, మేజిస్ట్రేట్ల దృష్టికి తీసుకెళ్లాం. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది'' అని పేర్కొన్నారు. 'ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో 34 మంది కార్యకర్తలు, పలువురు సీపీఐ(ఎం) మద్దతుదారులు, నలుగురు అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారు. 20 ఎఫ్ఐఆర్లు నమోదుచేయబడ్డాయి. కానీ ఇప్పటివరకు ఒక్కరినీ అరెస్టు చేయలేదు. సీపీఐ(ఎం) కార్యకర్తల ఇండ్లను దోచుకున్నారు. వాహనాలను ధ్వసం చేశారు. మా అభ్యర్థుల్లో 17 మంది కుటుంబాలపై దాడులుచేశారు. బలవంతంగా వారి నామినేషన్లు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఈ దాడులు అధికార ఎమ్మెల్యేలు, మంత్రులున్న ప్రాంతాల్లోనే జరిగాయి'' అని చౌదరి వెల్లడించారు.
ఈ నెల 25న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, 28న కౌంటింగ్ జరగనుంది.
తమ అభ్యర్థులపై కూడా బీజేపీ కార్యకర్తల దాడులు : టీఎంసీ
రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హింసలో పోలీసుల పాత్రను నిరసిస్తూ టీఎంసీ గురువారం పోలీసు ప్రధాన కార్యాలయాన్ని ఘెరావ్ చేసింది. టీఎంసీ ఎంపీ సుస్మితా దేవ్ మాట్లాడుతూ.. తమ అభ్యర్థులపై బీజేపీ దుర్మార్గులు దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. దీనిపై నమోదైన పలు ఎఫ్ఐఆర్లను గురించి ప్రస్తావిస్తూ.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తమ అభ్యర్థులపై దాడులు చేస్తున్నది ఎవరో తమ వద్ద ఆధారాలున్నాయి. అయితే, త్రిపుర పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు వారిని అరెస్టు చేయడం లేదు? అంటూ ప్రశ్నించారు.