Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రిబ్యునల్ ఏర్పాటు జాప్యానికి ఆయనే కారణం
- గెజిట్ నోటిఫికేషన్ కు ఇద్దరు సీఎంల అంగీకారం
- కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్
న్యూఢిల్లీ : గెజిట్ నోటిఫికేషన్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డ్రామా ఆడుతున్నారని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. అపెక్స్ కౌన్సిల్లో అంగీకరించి, ఇప్పుడు కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. బాధ్యతాయుతమైన సీఎం కుర్చీలో కూర్చోని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గెజిట్ నోటిఫికేషన్, కొత్త ట్రిబ్యునల్ విషయంలో కేంద్ర జలశక్తిపై కేసీఆర్ చేస్తోన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ మేరకు గురువారం నాడిక్కడ కేంద్ర జలశక్తి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడారు. కేసీఆర్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునన్నారు. కేసీఆర్ మీడియా సమావేశంలో తన పేరు ప్రస్తావించారని, కేసీఆర్ లేవనెత్తిన అంశాలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. తెలంగాణ, ఏపీ, దేశ ప్రజలకు నిజం చెప్పేందుకే వివరణ ఇస్తున్నానని అన్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ)లను పార్లమెంట్ ఆమోదించిందని అన్నారు. గతేడాది అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్లో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధికి ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించారని తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్ పై రెండు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి, ఒప్పందంతో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మరి అలాంటప్పుడు ఇదేలా కేంద్ర ప్రభుత్వ డ్రామా అవుతుందని నిలదీశారు. కేసీఆర్ తీరును ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొన్నారు. బోర్డులకు నియంత్రణ అప్పగిస్తే వివాదాలకు ఆస్కారం లేకుండా నీటి పంపిణి జరుగుతుందన్నారు. నోటిఫికేషన్ ప్రకారం ఇరు రాష్ట్రాలు ప్రాజెక్ట్‌లను బోర్డులకు అప్పగించాలని సూచించారు. బోర్డుల ద్వారా అనుమతులు లేని ప్రాజెక్ట్ లకు సీడబ్ల్యూసీ ద్వారా డీపీఆర్‌లను సమర్పంచాలని చెప్పారు. అలాగే, బోర్డుల నిర్వహణ కోసం సిబ్బంది, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు.
కేసీఆర్ వల్లే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యం
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కారణంగానే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంలో జాప్యం జరిగిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 2015లో కేసీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఈ అంశం కోర్టులో ఉన్నప్పుడు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోడానికి ఉండదని వివరించారు. అయితే, గతేడాది అక్టోబర్ 6 న జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కేసీఆర్ కొత్త ట్రిబ్యునల్ ప్రస్తావన తీసుకొచ్చారని చెప్పారు. అప్పుడు కోర్టులో ఈ అంశం ఉందని చెప్పగా, రెండు రోజులు కేసును వెనక్కి తీసుకుంటామని చెప్పిన కేసీఆర్ నెలలు గడిపారనన్నారు. గత నెల ఈ పిటిషన్ ఉపసంహరణకు సుప్రీం కోర్టు అంగీకరించిందన్నారు. కేసీఆర్ జాప్యానికి కేంద్రాన్ని ఎలా బాధ్యులను చేస్తున్నారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వమే సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసి 2015 నుంచి ఇప్పటి వరకు జాప్యం చేసిందని ఆయన స్పష్టం చేశారు. కాగా ట్రిబ్యునల్ ఏర్పాటుపై న్యాయ శాఖ సలహా కోరామని మంత్రి తెలిపారు.