Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు రోజుల పాటు సార్వత్రిక సమ్మె
- క్షేత్రస్థాయిలో ప్రచారోద్యమం
- పది కేంద్ర కార్మిక సంఘాల జాతీయ సదస్సు పిలుపు
- సంయుక్త కిసాన్ మోర్చా నేతల సంఘీభావం
న్యూఢిల్లీ : ప్రజలను, దేశాన్ని రక్షించేందుకు (సేవ్ పీపుల్-సేవ్ నేషన్) కొనసాగుతున్న ఐక్య పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని పది కేంద్ర కార్మిక సంఘాల జాతీయ కన్వెన్షన్ పిలుపునిచ్చింది. అలాగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు సార్వత్రిక సమ్మె చేయాలనే డిక్లరేషన్‌ను కన్వెన్షన్ ఆమోదించింది. అందుకోసం క్షేత్ర స్థాయి ప్రణాళి కను కూడా నిర్ణయించింది. నవంబర్-డిసెంబర్లో రాష్ట్ర స్థాయి, జిల్లా, ప్రాంతీయ స్థాయిల్లో ఉమ్మడి కన్వెన్షన్లు నిర్వహించాలనీ, ప్రభుత్వరంగ సంస్థల సంఘాలతో సంయుక్త సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్-జనవరి మధ్య క్షేత్రస్థాయిల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలనీ, ఈ సందర్భంగా జనరల్ బాడీ సమావేశాలు, సంతకాల సేకరణతో పాటు రాష్ట్ర కన్వెన్షన్ తీసుకున్న ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. జనవరిలో రాష్ట్ర, జిల్లా, రంగాల స్థాయిలో ర్యాలీలు, ఆందోళనలు, జాతాలు, ధర్నాలు (ఒకరోజు), ఫ్యాక్టరీ గేట్లు, పట్టణ మండీ, అలాగే మహాపడావ్ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు ఇచ్చింది. క్షేత్ర కార్యాచరణ ద్వారా కార్మికుల సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయడానికి శ్రామికులను, ప్రజలను సిద్ధం చేయాలని కన్వెన్షన్ పిలుపునిచ్చింది.
జంతర్ మంతర్వద్ద పది కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సంఘాలు, అసోసియేషన్లు, ఫెడరేషన్ల జాతీయ కన్వెన్షన్ గురువారం నాడిక్కడ జరిగింది. హేమలత (సీఐటీయూ), సుకుమార్ దామ్లే (ఏఐటీయూసీ), సంజరు సింగ్ (ఐఎన్టీయూసీ), రాజా శ్రీధర్ (హెచ్ఎంఎస్), రమేష్ పరాశర్ (ఏఐయూటీయూసీ), శివశంకర్ (టీయూసీసీ), ఫరీదా జాలిస్ (ఎస్ఈడబ్ల్యూఏ), శైలేంద్ర కె శర్మ (ఏఐసీసీటీయూ), ఆర్కె మౌర్య (ఎల్పీఎఫ్), నజీమ్ హుస్సేన్ (యూటీయూసీ) తదితరులు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. కార్మిక, రైతు, ప్రజా, దేశ వ్యతిరేక, కార్పొరేట్ అనుకూలమైన ప్రభుత్వ విధానాలపై సమావేశం చర్చించింది. ప్రజల జీవితాలను, జీవనోపాధిని, దేశ ఆర్థిక వ్యవస్థను విపత్తు అంచుకు తీసుకువచ్చిన వైనంపై చర్చ జరిగింది. ఇప్పుడు జరుగుతున్న పోరాటం ప్రజల హక్కులు, జీవితాలను, జీవనోపాధిని కాపాడటమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను, మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకేనని కన్వెన్షన్ స్పష్టం చేసింది. దేశీయ, విదేశీ ప్రయివేట్ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ, పాలనలో నిరంకుశ శక్తులకు వ్యతిరేంకగా ఐక్య పోరాటం నిర్మించాల్సిన అవసరాన్ని కన్వెన్షన్ నొక్కిచెప్పింది. కార్మిక సంఘాల కన్వెన్షన్‌కు సంయుక్త కిసాన్ మోర్చా నేతలు సంఘీభావం తెలిపారు. ఎస్కేఎం నేతలు హన్నన్ మొల్లా, దర్శన్ పాల్, కృష్ణ ప్రసాద్, విజూ కృష్ణన్, విక్రమ్ సింగ్ తదితరులు సంఘీభావం తెలిపారు.
తపన్ సేన్ (సీఐటీయూ), అమర్జీత్ కౌర్ (ఏఐటీయూసీ), అశోక్ సింగ్ (ఐఎన్టీయూసీ), హర్భజన్ సింగ్ సిద్ధూ (హెచ్ఎంఎస్), సత్యవాన్ (ఏఐయూటీయూసీ), జి.దేవరాజన్ (టీయూసీసీ), సోనియా జార్జ్ (ఎస్ఈడబ్ల్యూఏ), రాజీవ్ దిమ్రీ (ఏఐసీసీటీయూ), జెపి సింగ్ (ఎల్పీఎఫ్), శత్రుజీత్ (యూటీయూసీ) తదితరులు కన్వెన్షన్‌ను ఉద్దేశించి మాట్లాడారు. కార్మిక కోడ్లు, వ్యవసాయ చట్టాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి కాలాన్ని ఎలా ఉపయోగించుకుందో వివరించారు. ఆ తరువాత లాభదాయకమైన ప్రభుత్వరంగాన్ని పూర్తిగా విక్రయించడం వంటి ప్రయివేటీకరణ డ్రైవ్‌ను అనుసరించిందని విమర్శించారు. దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌తో సహా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, సాధారణంగా వెనుకబడిన తరగతులకు, యువతకు ఉపాధి అవకాశాలు క్షీణించాయని తెలిపారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారతదేశం 106వ స్థానానికి పడిపోయిందనీ, ఆకలిని ప్రధాన సామాజిక రుగ్మతలలో ఒకటిగా కలిగి ఉన్న దేశాల్లో భారత దేశం కూడా ఉందని తెలిపారు. ప్రజల్లో ఐక్యతను, అసంతృప్తిని విచ్ఛిన్నం చేసేందుకు విద్వేషం రెచ్చగొడుతుందనీ, వైవిధ్యమైన సామాజిక స్వరూపాన్ని చీల్చి చెండాడుతోందని ఆరోపించారు. దేశంలో ఏడాదిగా కొనసాగుతున్న రైతు ఉద్యమానికి కార్మిక సంఘాలు సెల్యూట్ తెలుపుతున్నాయనీ, రైతు ఉద్యమానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. తొలిత ఇటీవలి మరణించిన ఎల్పిఎఫ్ అధ్యక్షుడు వి.సుబ్బరామన్‌కు, కోవిడ్-19 కాలంలో మరణించిన కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, ప్రజా జీవితంలో ప్రముఖులు, రైతులకు కన్వెన్షన్ నివాళులర్పించింది. ఇటీవలి లఖింపూర్ ఖేరీ ఘటన సహా గత ఏడాదిగా కొనసాగుతున్న చారిత్రాత్మక రైతు ఉద్యమంలో మరణించిన అమరవీరులకు, ద్వేషపూరిత నేరాల కారణంగా మరణించిన వారికి కన్వెన్షన్ నివాళులర్పించింది.
కన్వెన్షన్ డిమాండ్లు
1. లేబర్ కోడ్లను రద్దు చేయాలి
2. మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ (సవరణ) బిల్లును రద్దు చేయాలి.
3. ఏ రూపంలోనైనా ప్రయివేటీకరణ చేయకూడదు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ)ని రద్దు చేయాలి.
4. ఆహారం, ఆదాయ మద్దతు కోసం ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలకు నెలకు రూ. 7500 ఇవ్వాలి.
5. ఉపాధికి కేటాయింపులు పెంచాలి. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావాలి.
6. అన్ని అసంఘటిత రంగ కార్మికులకు సార్వత్రిక సామాజిక భద్రత కల్పించాలి.
7. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఇతర స్కీమ్ వర్కర్లకు చట్టబద్ధమైన కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించాలి.
8. కరోనా మహమ్మారి మధ్య ప్రజలకు సేవ చేస్తున్న ఫ్రంట్‌లైన్ కార్మికులకు సరైన రక్షణ, బీమా సౌకర్యం కల్పించాలి.
9. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలతో పాటు ఇతర కీలకమైన ప్రజా వినియోగాల్లో ప్రభుత్వ పెట్టుబడిని పెంచాలి. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించేందుకు ధనవంతులపై సంపద పన్ను విధించాలి.
10. పెట్రోలియం ఉత్పత్తులపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల అరికట్టేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలి.
11. కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
12. నూతన ఫెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్) రద్దు చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.