Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూర్ కేసులో యూపీ ప్రభుత్వానికి సుప్రీం డెడ్లైన్
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన 'సిట్' (ప్రత్యేక దర్యాప్తు బృందం) విచారణను పర్యవేక్షించడానికి ఇతర రాష్ట్రాల హైకోర్టు మాజీ న్యాయమూర్తులను సుప్రీంకోర్టు ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం (నవంబర్ 15) కల్లా ఈ అంశంపై తమ వైఖరి తెలపాలని యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తాజాగా గడువు విధించింది. మాజీ న్యాయమూర్తులతో కూడిన బృందం సిట్ దర్యాప్తును రోజువారీగా పర్యవేక్షిస్తుందని సుప్రీం పేర్కొన్నది. లఖింపూర్ ఖేరి ఘటనపై శుక్రవారం సుప్రీం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనమేరకు కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు రైతులు మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతిచెందారు. దాంతో ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది. రైతుల మృతిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా ఈ ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రా పేరును పోలీసులు చేర్చారు. క్రైం బ్రాంచ్ పోలీసులు సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. సిట్ దర్యాప్తు పర్యవేక్షణకు వేరే రాష్ట్రాల హైకోర్టు మాజీ న్యాయమూర్తుల నియామకం అంశంపై తమ వైఖరి తెలిపేందుకు ప్రభుత్వానికి నవంబర్ 15 వరకు గడువు ఇచ్చింది. లఖింపూర్ ఘటనను సుమోటాగా స్వీకరించిన ధర్మాసనం...భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే యూపీ ప్రభుత్వం తరఫున గడువు కోరారు. సోమవారం వరకు సమయం ఇవ్వాలని, ఈ అంశంపై దాదాపు పని పూర్తిచేసినట్టు తెలిపారు. న్యాయవాది అభ్యర్థన మేరకు విచారణను వాయిదా వేసిన ధర్మాసనం..సోమవారం తమ వైఖరి తెలపాలని స్పష్టం చేసింది.