Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీసుకున్నది సుశేన్ గుప్తా..మరికొంతమంది!
- సీబీఐకి 2019లో నిందితులు వాంగ్మూలం
న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ 'డస్సాల్ట్ ఏవియేషన్' (ఫ్రాన్స్) అవినీతి బాగోతాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. యుద్ధ విమానాల కొనుగోలులో మోడీ సర్కార్ అవకతవకల్ని ఫ్రాన్స్‌కు చెందిన పరిశోధన జర్నల్ 'మీడియాపార్ట్' కొద్ది రోజుల క్రితం బయటపెట్టింది. దీంట్లో 2007-2012 మధ్యకాలంలో మధ్యవర్తి సుశేన్గుప్తాకు రూ.65కోట్లు డస్సాల్ట్ ఏవియేషన్ నుంచి ముడుపులు అందాయని పేర్కొన్నది. దీనికంటే ముందు 2003-06 మధ్యకాలం లో ఆనాటి యూపీఏ ప్రభుత్వం చేసుకున్న అగస్టావెస్ట్ ల్యాండ్ ఒప్పందం (వీవీఐపీలకు హెలిక్యాప్టర్లు)లోనూ అవినీతి జరిగిందని, ఇందులోనూ మధ్యవర్తిగా వ్యవహరించిన సుశేన్ గుప్తాకు రూ.4.15కోట్లు (740,128 యూరోలు), మరికొంత మందికి ముడుపులు అందాయని సీబీఐ ఛార్జ్‌షీట్ కూడా దాఖలుచేసింది. డస్సాల్ట్ ఏవియేషన్ తమకు కమిషన్ రూపంలో 740,128 యూరోలు పంపిందని ఐడీఎస్ టెక్నాలజీ మేనేజర్ ధీరజ్ అగర్వాల్ సీబీఐకి 18 మార్చి 2019లో ఇచ్చిన వాంగ్మూలం ఇచ్చాడు. డస్సాల్ట్ పంపిన యూరోలు చండీగఢ్‌లోని ఐడీఎస్ కంపెనీ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాల్లో జమైనాయి. అగస్టావెస్ట్ ల్యాండ్, యూపీఏ కుదుర్చుకున్న రాఫెల్ డీల్-1లో అవినీతి ఉందని సీబీఐ, ఈడీకి స్పష్టమైన ఆధారాలు లభించాయి. అయినాకూడా దీనిపై మోడీ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? మధ్యవర్తి ముడుపులపై విచారణకు ఎందుకు ఆదేశించటం లేదు? అని 'మీడియాపార్ట్' ప్రశ్నించింది.